‘నియోకోవ్’ పేరుతో కరోనా యొక్క కొత్త వేరియంట్ వచ్చిందని, అది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం ఉందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘నియోకోవ్’ పేరుతో కరోనా యొక్క కొత్త వేరియంట్; అది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం.
ఫాక్ట్: నియోకోవ్ పేరుతో కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ ఏదీ కనుగొనబడలేదు. నియోకోవ్ అనే కరోనా వైరస్ ఎప్పుడో సౌత్ఆఫ్రికాలో గబ్బిలాలలో కనుగొన్నారు, కనీసం 2013 నుండి శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారు. నియోకోవ్ ఇప్పటివరకు మనుషులకు సోకనప్పటికీ, భవిష్యత్తులో నియోకోవ్ పై మ్యుటేషన్లు జరిగి, మనుషులకు సంక్రమించే ఆస్కారం ఉందని వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల విడుదల చేసిన అధ్యయనంలో తెలిపారు. కొన్ని వార్తాకథనాలలో నియోకోవ్ వ్యాధి సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరిని చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హైలైట్ చేసారు. కానీ, ఇంతవరకు మనిషికి నియోకోవ్ వైరస్ సోకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు నియోకోవ్ అనే కరోనా వైరస్ పై ఇటీవల ఒక అధ్యయనాన్ని విడుదల చేసినట్టు తెలిసింది. ఆ అధ్యయనంలో ఎక్కడా కూడా ‘నియోకోవ్’ పేరుతో కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ వచ్చిందని లేదు. దాంతోపాటు ఆ అధ్యయనం ఒక ‘non-peer-reviewed study’, అంటే ఈ అధ్యయనంలో తెలిపినవి మీడియా వారు ఒక ‘conclusive’ ప్రూఫ్ గా రిపోర్ట్ చేయకూడదు.
నియోకోవ్ తమ ACE2 రిసెప్టార్ల ద్వారా గబ్బిలాల కణాల్లోకి ప్రవేశిస్తుందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనుషులకు ACE2 రిసెప్టార్స్ (హెచ్ఎసిఈ2) కూడా ఉంటాయి, ఇది సార్స్-కోవ్-2 (కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే వైరస్) వంటి వైరస్ లతో సంకర్షణ చెందుతుంది, అయితే నియోకోవ్ అటువంటి మానవ హెచ్ఎసిఈ2 రిసెప్టార్స్ ను సంకర్షణ చేయలేదని అధ్యయనం కనుగొంది.
ఈ కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషులకు సోకలేనప్పటికీ, భవిష్యత్తులో నియోకోవ్ పై మ్యుటేషన్లు జరిగి, మనుషులకు సంక్రమించే ఆస్కారం ఉంది. కావున, ఈ కరోనా వైరస్ ను జాగ్రత్తగా మానిటర్ చేయాలని తెలిపారు.
నియోకోవ్ అనే కరోనా వైరస్ ఎప్పుడో సౌత్ఆఫ్రికాలో కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, నియోకోవ్ అనే కరోనా వైరస్ ఒక నిర్దిష్ట జాతుల గబ్బిలాలకు మాత్రమే సంక్రమిస్తుంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-కోవ్)కు దగ్గరి బంధువుగా పరిగణించబడుతుంది. కనీసం 2013 నుండి శాస్త్రవేత్తలచే అధ్యయనం చేయబడుతోంది.
జంతువులలో వందలాది కరోనా వైరస్ లు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే మనిషికి సోకుతాయి – దీనిని జూనోటిక్ స్పిల్ ఓవర్ అని అంటారు. కరోనావైరస్ లు మనిషి పై భాగంలో ఉన్న శ్వాసనాళ అస్వస్థతలను కలిగిస్తాయి. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి మనుషులకు సోకే ఏడవ రకం కరోనా వైరస్. ఏ మనిషికీ నియోకోవ్ వైరస్ సోకలేదనీ (భవిష్యత్తులో మ్యుటేషన్ అవనంత వరకు), ఇటీవల చేసిన అధ్యయనం కూడా పీర్-రివ్యూ చేయబడలేదని డాక్టర్లు పేర్కొన్నారు.
కొన్ని వార్తాకథనాలలో నియోకోవ్ వ్యాధి సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరిని చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హైలైట్ చేసారు. కానీ, ఇంతవరకు మనిషికి నియోకోవ్ వైరస్ సోకలేదు. గతంలో ఇటువంటి వైరస్ ప్రవర్తించిన తీరుని బట్టి ఇలా రిపోర్ట్ చేస్తున్నారు. దాని అర్థం, అధ్యయనంలో అది తేలిందని కాదు
చివరగా, నియోకోవ్ అనే కరోనావైరస్ ఇప్పటివరకు మనుషులకు సోకలేదు; ఇది కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ కాదు, కనీసం 2013 నుండి శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారు.