ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి గత మూడేళ్లుగా నిరంతరంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తూ ఉంటే, ఆ వ్యక్తి కుటుంబానికి గత మూడేళ్లుగా అతని సగటు వార్షిక ఆదాయానికి పది రెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. మోటార్ చట్టం, 1988లోని సెక్షన్ 166 మరియు 2013లో వెల్లడైన సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇది జరగాలని ఈ పోస్టులో చెప్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ప్రమాదవశాత్తూ మరణించిన వ్యక్తికి అతని చివరి మూడు సంవత్సరాల ఆదాయ సగటు మొత్తాన్ని ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలి.
ఫాక్ట్(నిజం): మోటార్ వెహికల్ చట్టం 1988లోని సెక్షన్ 166లో లేదా సవరించిన 2019 చట్టంలో గానీ మరణించిన వ్యక్తి గత మూడేళ్ళ ఆదాయానికి పది రెట్ల పరిహారం చెల్లించాలని ఎక్కడా చెప్పలేదు. 2013లో వెల్లడైన సుప్రీంకోర్టు తీర్పు కూడా 1988 చట్టంలోని రెండొవ షెడ్యూల్ ప్రకారం పరిహారం ఎలా లెక్కించాలో చెప్పిందే గాని మరణించిన వ్యక్తి ఆదాయానికి పదింతలు ఇవ్వాలని చెప్పలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మోటార్ చట్టంలోని సెక్షన్ 166?
పోస్టులో చెప్తున్నదానికి అనుగుణంగా మోటార్ చట్టంలోని సెక్షన్ 166లో గాని 2013 సుప్రీంకోర్టు తీర్పులో గాని ఎలాంటి నిబంధనలు లేవు. మోటార్ చట్టం,1988లోని సెక్షన్ 166లో కేవలం పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు అన్న విషయాల గురించే ప్రస్తావించారు తప్ప ఎంత పరిహారం చెల్లించాలి అన్న విషయాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సెక్షన్ లో చెప్తున్నదాని ప్రకారం మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT)లో పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేయాలి.
1988 చట్టం ప్రకారం పరిహారం ఎవరు చెల్లిస్తారు?
ఆక్సిడెంట్ లో వ్యక్తి మరణించినప్పుడు లేదా శాశ్వత వైకల్యం కలిగిన సందర్భాలలో ప్రమాదానికి కారణమైన మోటారు వాహన యజమాని 1988 చట్టంలోని సెక్షన్ 140 ప్రకారం పరిహారం చెల్లించవలసి ఉంటుంది.
ఐతే 1988 చట్టానికి 2019లో సవరణలు చేసారు. ఈ సవరించిన చట్టంలో కూడా ఈ సెక్షన్ పైన తెలిపిన విషయాలనే ప్రస్తావిస్తుంది. 2019 చట్టం సెక్షన్ 164(1) ప్రకారం వ్యక్తి మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, తీవ్రమైన గాయం అయితే రెండున్నర లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పరిహారం నచ్చకపొతే సెక్షన్ 149లో పేర్కొన్నట్టు ఇన్సూరెన్సు కంపెనీ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా ఒక సెటిల్మెంట్ చేసుకోవచ్చు.
అలాగే 2019లో చేసిన చట్టంలో ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు నగదు రహిత ట్రీట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఐతే ఈ సవరణ చట్టంలో ఎక్కడా కూడా మరణించిన వ్యక్తి గత మూడేళ్ళ ఆదాయానికి పది రెట్లు పరిహారం చెల్లించాలని ఎక్కడా చెప్పలేదు.
2013 సుప్రీంకోర్టు తీర్పు:
వైరల్ పోస్టులో ప్రస్తావించిన ఈ తీర్పు నిజానికి మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటనలో MACT నిర్ణయించిన పరిహారం విషయంలో అప్పీల్ చేసిన కేసుకు సంబంధించింది. ఐతే ఈ తీర్పులో కోర్టు 1988 చట్టంలోని రెండొవ షెడ్యూల్‌లో చెప్తున్నదాని ప్రకారం పరిహారం ఎంత నిర్ణయించాలో అన్న అంశంపై స్పష్టతను ఇచ్చిందే తప్ప, మరణించిన వ్యక్తి ఆదాయం అనుగుణంగా పరిహారం చెల్లించాలి అంటూ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ప్రభుత్వం అతని గత మూడేళ్ళ ఆదాయానికి పదింతలు పరిహారం చెల్లించాలని మోటార్ వెహికల్ చట్టంలో చెప్పలేదు.