రాజస్థాన్ బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్ ఓ మహిళతో సన్నిహితంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు అని చెపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. బీజేపీ నేత దేవ్‌జీ పటేల్ రాజస్థాన్‌లోని జలోర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడు. ఈ ఆర్టికల్ ద్వారా, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలిద్దాం.

క్లెయిమ్: బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్ ఒక మహిళతో సన్నిహితంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఇది పాకిస్తాన్‌లోని ప్రముఖ కంటి స్పెషలిస్ట్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ తన ఆసుపత్రి గదిలో పార్టీ చేసుకొని ఒక మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో. ఈ వీడియో ఫిబ్రవరి 2020లో లీక్ అయ్యింది. ఆ తర్వాత భారతదేశంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులకు ఆపాదిస్తూ ఇదే వీడియో ప్రచారం చేయబడింది. జలోర్ పోలీసులు ఒక ట్వీట్ ద్వారా వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి దేవ్‌జీ పటేల్ కాదని ధృవీకరించారు మరియు ఇది రెండేళ్ల నాటి వీడియో అని స్పష్టం చేశారు. 25 జూన్ 2022న, జలోర్ ఎంపీ దేవ్‌జీ పటేల్‌కు ఆపాదిస్తూ ఈ పాత వీడియోను షేర్ చేసిన నిందితుల్లో ఒకరిని జలోర్ పోలీసులు అరెస్టు చేశారు. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 13 ఫిబ్రవరి 2020న ఒక పాకిస్తాన్ మీడియా వెబ్‌సైట్ పోస్ట్ చేసిన ఇలాంటి విజువల్స్‌తో కూడిన వీడియో ఒకటి కనిపించింది . ఈ వార్తా వెబ్‌సైట్ ఇందులో ఉన్న వ్యక్తి పాకిస్తాన్‌లోని సౌత్ పంజాబ్‌కి చెందిన ప్రముఖ కంటి స్పెషలిస్ట్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ అని పేర్కొనింది. తన ఆసుపత్రి గదిలో పార్టీ చేసుకున్న తర్వాత ఒక మహిళతో కలిసి డ్యాన్స్ చేసాడని ఈ పోస్టు ద్వారా తెలిసింది.

02 ఫిబ్రవరి 2020న, డాక్టర్ జాఫర్ ఇక్బాల్ స్కాండల్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని ‘డైలీ పాకిస్థాన్’ న్యూస్ వెబ్‌సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. తరువాత, అదే వీడియో భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఆపాదించబడింది.

పోస్ట్‌లో చేసిన క్లయిముకి సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం ఇంటర్నెట్లో వెతుకగా, జలోర్ బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్‌కి ఆపాదించబడిన ఈ వైరల్ వీడియోకు సంబంధించి జలోర్ పోలీసులు ప్రచురించిన ట్వీట్ ఒకటి దొరికింది. జలోర్ పోలీసులు ఒక ప్రెస్ రిలీజ్ యొక్క స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, దేవ్‌జీ పటేల్‌కు ఆపాదించబడిన ఈ వైరల్ వీడియో రెండేళ్ల నాటిదని పేర్కొన్నారు. దేవ్‌జీ పటేల్‌కు ఆపాదించే ఈ పాత వీడియోను షేర్ చేసిన ప్రధాన నిందితులలో ఒకరిని అరెస్టు చేసినట్లు ప్రజలకు తెలియజేశారు.
దేవ్‌జీ పటేల్‌కు ఆపాదించబడిన ఈ వైరల్ వీడియోకు సంబంధించి జాలోర్ పోలీసులు విడుదల చేసిన మరో పత్రికా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు. జలోర్ పోలీసులు జారీ చేసిన వివరణను నివేదిస్తూ పలు వార్తా వెబ్‌సైట్‌లు కథనాలు మరియు వీడియోలను ప్రచురించాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

మొత్తానికి, బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్ ఒక మహిళతో సన్నిహితంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోగా పాకిస్థాన్‌కు చెందిన సంబంధం లేని పాత వీడియో షేర్ చేస్తున్నారు.