ఎటువంటి అనుమతులు లేకుండా తమ సొంత ఇళ్లలోనే చర్చిలను నిర్మించుకునే అధికారం క్రైస్తవులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిందని చెప్తూ కోర్టు తీర్పు కాపీని కలిగి ఉన్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఎటువంటి అనుమతులు లేకుండా క్రైస్తవులకు తమ సొంత ఇళ్లలోనే చర్చిలను నిర్మించుకోవచ్చని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఫాక్ట్: 2018లోమద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో నివాస గృహంలో ప్రార్థనలు జరుపుకోవడానికి ఏ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ, ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలలో శబ్దకాలుష్యం లేదా మరేదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే ఘటనలు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాలు సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పులో ఎక్కడా కూడా నివాస గృహంలో చర్చిని నిర్మించుకోవచ్చని కోర్టు చెప్పలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులో ఇవ్వబడిన కోర్టు తీర్పు కాపీని పరిశీలించాం. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని రాజగోపాలపేరి గ్రామానికి చెందిన సౌందరపాండ్యన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారణ పేరుతో స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ప్రార్ధనలు చేసుకోనివ్వకుండా వేధిస్తున్నాడని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు.
అయితే కోర్టు ఇదే విషయంపై ఇదివరకే జారీ చేసిన తీర్పులను ప్రస్తావిస్తూ, నివాస గృహంలో ప్రార్థనలు జరుపుకోవడానికి ఏ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలలో శబ్దకాలుష్యం లేదా మరేదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే ఘటనలు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాలు సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు ఉంటాయని స్పష్టం చేసింది.
పైగా, ఈ తీర్పులో ఎక్కడా కూడా నివాస గృహంలో చర్చిని నిర్మించుకోవచ్చునని కోర్టు చెప్పలేదు. కేవలం నివాస గృహంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రార్థనలు చేసుకోవచ్చని మాత్రమే చెప్పబడింది.
ఇక చర్చిల నిర్మాణం విషయానికి వస్తే, Andhra Pradesh Gram Panchayat Land Development (Layout and Building) Rules, 2002 ప్రకారం, చర్చిలు, ఆలయాలు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలను నిర్మించడానికి జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు 2021లో తీర్పునిచ్చింది.
అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో మతపరమైన కట్టడాలకు జిల్లా కలెక్టర్ అనుమతిని రద్దు చేస్తూ ఈ నిబంధనలకు షరతులతో కూడిన సవరణను చేయడం జరిగింది.
చివరిగా, నివాస ప్రాంతాల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రార్ధనలు చేసుకోవడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని మాత్రమే మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.