“రాయికి ఆకలి ఉండదు, కాబట్టి హిందువులు లింగానికి పాలు పోయడం మానేయాలి”, అని బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అంతేకాదు, అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు బిగ్ బాస్ మాజీ పోటీదారు పాయల్ రోహత్గి, “చనిపోయిన వారికి చలి ఉండదు, కాబట్టి ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలి” అని సమాధానమిచ్చినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాయల్ రోహాత్గి ముస్లిం ఆచారాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్ (నిజం): హిందువులు శివ లింగాలపై పాలు పోయవద్దని ఆమీర్ ఖాన్, చనిపోయిన వారికి చలి ఉండదు కాబట్టి ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలని పాయల్ రోహత్గి బహిరంగ ప్రకటన ఎప్పుడూ చేయలేదు. ముస్లిం ఆచారాలకి వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను ఒక మహిళ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్, హిందువులు శివలింగాలకు పాలు పోయడం మానేయాలని ఎప్పుడైనా పేర్కొన్నారా అని వెతికితే, హిందూ మత ఆచారాలకు వ్యతిరేకమైన ఈ వ్యాఖ్యలు అమీర్ ఖాన్ ఎప్పుడు చేయలేదని తెలిసింది. ఒక వేళ ఆమీర్ ఖాన్ నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు. దేవుడి విగ్రహాల కోసం వృధా చేసే పాలతో పేద పిల్లల ఆకలి తీర్చవచ్చని ఆమీర్ ఖాన్ తన సత్యమవే జయతే కార్యక్రమంలో పేర్కొన్నట్టు 2015లో కొందరు పోస్టులు పెట్టారు. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, సత్యమవే జయతే కార్యక్రమంలో పోషకాహారాలకు సంబంధించి, వృధా నిర్వహణకి సంబంధించి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లలో ఆమీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని తెలిసింది.
అలాగే, బిగ్ బాస్ మాజీ పోటీదారు పాయల్ రోహత్గి, ఆమీర్ ఖాన్ హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారని, ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలనే వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదని తెలిసింది. ఒక వేళ పాయల్ రోహత్గి నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు. పాయల్ రోహాత్గి పలు మార్లు ఆమీర్ ఖాన్‌ని విమర్శిస్తూ తన సోషల్ మీడియా పేజీలలో వీడియోలని అప్లోడ్ చేసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, పాయల్ రోహత్గి పలు సార్లు ముస్లిం ఆచారాలని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసి వార్తలోకి ఎక్కింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలని పాయల్ రోహత్గి అన్నట్టు మాకు ఎక్కడా ఆధారాలు దొరకలేదు.
ఆమీర్ ఖాన్ ‘పీకే’ చిత్రంలో శివ లింగంపై పాలు పోసే బదులు పేద పిల్లల ఆకలి తీర్చవచ్చని తెలిపారు. అయితే, ముస్లింలు కూడా సమాధులపై చాదర్ కప్పడం మానేసి పేద ప్రజలకు చలి లేకుండా చూడాలని ఒక హిందూ మహిళ సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన హిందూ మహిళ ఎవరనే విషయం తెలియలేదు. కాని, వీడియోలో కనిపిస్తున్న మహిళ పాయల్ రోహత్గి మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తుంది.
చివరగా, శివలింగానికి పాలు పోయవద్దని ఆమీర్ ఖాన్, ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలని పాయల్ రోహాత్గి వ్యాఖ్యానించలేదు.