Fake News, Telugu
 

ప్రభుత్వ ఉద్యోగులు’యాత్ర 2′ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ షేర్ అవుతున్న ఈ GO ఫేక్

0

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన ‘యాత్ర 2’ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GO విడుదల చేసిందంటూ ఒక కాపీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరికొన్ని పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: ప్రభుత్వ ఉద్యోగులు ‘యాత్ర 2’ సినిమా చూసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన GO కాపీ

ఫాక్ట్(నిజం): ప్రభుత్వం ఉద్యోగులు’యాత్ర 2′ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు/ GO విడుదల చేయలేదు. ఈ GO కాపీలో చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి ఈ GO ఫేక్ అని అర్ధమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు’యాత్ర 2′ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఎలాంటి మార్గదర్శకాలు/ GO విడుదల చేయలేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేసి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న GO చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరుతో ఉంది. ఐతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహరిస్తుండగా, నీలం సాహ్ని నవంబర్ 2019 – జనవరి 2021 మధ్య కాలంలో  ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసింది. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న GO కాపీ ఫేక్ అని, నీలం సాహ్ని చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో విడుదలైన ఒక GO కాపీను డిజిటల్‌గా ఎడిట్ చేసి ఉండొచ్చని అర్ధమవుతుంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న GO కాపీలోని డిపార్టుమెంట్ మరియు GO నెంబర్ ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జీ.ఓ. రిజిస్టర్ పోర్టల్‌లో వెతకగా మాకు ప్రభుత్వ ఉద్యోగులను ‘యాత్ర 2’ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఎలాంటి GO కనిపించలేదు.

కాగా యాత్ర 2 సినిమాపై ప్రభుత్వ GO అంటూ వస్తున్న వార్తాలు అవాస్తవమని, ప్రస్తుతం షేర్ అవుతున్న GO ఫేక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేసింది.

చివరగా, ప్రభుత్వ ఉద్యోగులు’యాత్ర 2′ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ షేర్ అవుతున్న ఈ GO ఫేక్

Share.

About Author

Comments are closed.

scroll