“హిందూ ఆగమశాస్త్రం ప్రకారం హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను ఉంచడం సరికాదని మద్రాసు హైకోర్టు హిందూ దేవాలయాల్లోని సాయిబాబా (సైఫోద్దీన్) విగ్రహాలను తొలగించాలని ఆదేశించింది” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఫాక్ట్(నిజం): ఇటీవల మద్రాసు హైకోర్టులో హిందూ దేవాలయాల్లోని షిర్డీ సాయిబాబా విగ్రహాలను తొలగించేలా తమిళనాడు రాష్ట్ర HR&CE డిపార్ట్‌మెంట్‌ని (హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ) ఆదేశించాలని కోరుతూ డి. సురేష్‌బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, 25 జూన్ 2024న ఈ పిటిషన్‌పై స్పందించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి(HR&CE డిపార్ట్‌మెంట్‌కు) నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను 19 జూలై 2024కి వాయిదా వేసింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశించిందదా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, షిర్డీ సాయిబాబా విగ్రహాలను హిందూ దేవాలయాల నుంచి తొలగించాలని తమిళనాడు రాష్ట్ర HR&CE డిపార్ట్‌మెంట్ (హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ)ని ఆదేశించాలని కోరుతూ డి. సురేష్‌బాబు అనే వ్యక్తి ఇటీవల మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని, హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాన్ని ఉంచడం ఆగమ సూత్రాలకు విరుద్ధమని, ఎందుకంటే సాయిబాబా ఇస్లాం, హిందూ మతం రెండింటినీ బోధించాడు అని పిటిషనర్ తన పిటిషన్‌పై పేర్కొన్నాడు అని చెప్తున్న ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వార్తకథనం ఒకటి లభించింది.ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
ఈ కథనాల ప్రకారం, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మొదటి బెంచ్, 25 జూన్ 2024న ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఆదేశిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచరం కోసం మేము మద్రాస్ హైకోర్టు అధికారిక వెబ్సైటులో వెతకగా, ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నట్లు మరియు ఇప్పటివరకి ఒకసారి మాత్రమే వాదనలు జరిగినట్లు తెలిసింది. అలాగే ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి(HR&CE డిపార్ట్‌మెంట్‌కు) మద్రాస్ హైకోర్టు నోటిసులు జారీ చేస్తూ ఈ కేసు తదుపరి విచారణ 19 జూలై 2024కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి మద్రాసు హైకోర్టు ఇటీవల హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలని ఆదేశించలేదని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు మాత్రమే జారీ చేసింది, ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.