సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఒక గుంపు అనేక మంది నగ్నంగా ఉన్న యువకులను కొట్టడం కనిపిస్తోంది. పోస్ట్ ప్రకారం, కొంతమంది ముస్లిం యువకులు గంగా నదిపై నగ్నంగా స్నానం చేస్తూ హిందూ భక్తులను ఇబ్బంది పెడుతున్నప్పుడు హిందువులు వారిని కొట్టి అక్కడ నుంచి పంపించినట్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ముస్లిం యువకులు గంగా నదిలో నగ్నంగా స్నానం చేస్తూ హిందూ భక్తులను ఇబ్బంది పెడుతున్న సమయంలో, హిందువులు వారిని కొట్టి పంపించిన సంఘటనకు చెందిన వీడియో.
ఫాక్ట్(నిజం): 10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చేటప్పటికి యువకులు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనలో కులం లేదా మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 12 సెప్టెంబర్ 2024న ప్రచురించబడిన ధమ్‌నోద్ సమాచార్ యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోకి దారితీసింది. వీడియో యొక్క వివరణలో “మహేశ్వర్‌లో నర్మదా నదిలో నంగగా స్నానం చేస్తున్న యువకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్” అని రాసుండటం మేము గమనించాం.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, మాకు దైనిక్ భాస్కర్ ప్రచురించిన రిపోర్ట్ లభించింది. దీని ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లోని అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు నర్మదా నదిలో నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఘాట్ వద్దకు వచ్చి, ఆ యువకులను నది నుంచి బయటకు లాగి కొట్టారు. కొందరు పోలీసులకు ఫోన్ చేసారు కానీ, వారు రాకముందే యువకులు క్షమాపణలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.

సంఘటన గురించి మరింత సమాచారం కోసం మేము మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాము. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఘాట్ వద్ద నగ్నంగా స్నానం చేస్తున్న కొంతమంది యువకులు మద్యం తాగి, ప్రజలకు ఇబ్బంది కలిగించారు. దీంతో స్థానికులు వారిని తరిమి కొట్టారని పోలీసులు తెలిపారు.అయితే, ఈ సంఘటన గురించి ఎలాంటి కేసు నమోదుకాలేదు. అంతే కాదు, ఈ ఘటనలో కుల, మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
ఇంతకుముందు ఉత్తర ప్రదేశ్‌లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయాన్ని దర్శించాలనుకుంటే, కొంతమంది వారిపై దాడి చేసినట్లు ఉన్న అదే వీడియో వైరల్ అయినప్పుడు వాటిని Factly ఫ్యాక్ట్-చెక్ చేసింది. దాన్ని మీరు ఇక్కడ చదవవచ్చు.
చివరిగా, మధ్యప్రదేశ్‌లోని అహల్యా ఘాట్‌లో నగ్నంగా స్నానం చేసినందుకు యువకులను కొట్టిన సంఘటనను మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.