అమ్మాయిలని తాకరాని చోట తాకుతున్న డోన్ వాసి సుభాన్ , చూసినవాళ్లు అడిగితే, వారి తన అడ్రస్ చెప్పి ఎం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నాడు అని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సుభాన్ అనే వ్యక్తి ఒక యూనిఫామ్ వేసుకొన్న అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్లు చూడవచ్చు. అసలు పోస్టులో ఉన్న క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: అమ్మాయిలను తాకరాని చోట తాకుతున్న డోన్ వాసి సుభాన్.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని సంఘటన 2022లో జరిగింది. అందులోని వ్యక్తి పేరు షేక్ మెహబూబ్ సుభాన్. తాను చేసిన ఈ పనికి గాను అతనిపై డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో FIR కూడా నమోదు అయ్యింది. ఈ కేసు లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకున్న కారణంగా 2023 ఫిబ్రవరిలో కోర్టు ఈ కేసుని కొట్టివేసింది. కావున పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
ఈ వీడియోలో జరిగిన సంఘటన, అందులో ఉన్న వ్యక్తి పేరు నిజమైనా కూడా, ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు అని మా పరిశోధనలో తెలిసింది. వీడియోలో ఉన్న వివరాలను బట్టి డోన్ నగరంలో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని ఇంటర్నెట్లో వెతకగా, ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
వివరాలు కనుక్కోవటం కోసం, డోన్ నగర సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌తో ఫోన్లో మాట్లాడాము. అయన ఇచ్చిన సమాచారాన్ని బట్టి, ఈ సంఘటన 2022లో (అప్పట్లో కూడా ఈ వీడియో వైరల్ అయ్యింది) డోన్ నగరంలో జరిగింది. ఆ వీడియోలో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి పేరు షేక్ మెహబూబ్ సుభాన్. తనపై IPC సెక్షన్ 354-D, 509 కింద కేసు కూడా నమోదు చేసారు (FIR No.98/2022).
ఈ కేసుకు సంబదించిన వివరాలను E Courts వెబ్సైట్ ద్వారా వెతికి పొందగా, ఫిబ్రవరి 2023లో ఈ కేసును కోర్టు కట్టివేసినట్టు తెలిసింది. లోక్ అదాలత్‌లో కేసును సెటిల్ చేసుకోవడాన్ని కోర్టు వారు కేసు కొట్టివేయడానికి కారణంగా పేర్కొన్నారు.
పాత వీడియోను సోషల్ మీడియాలో ఇప్పుడు reshare చేస్తున్నారు అని పోలీసు వారు మాకు చెప్పారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చివరిగా, నంద్యాల జిల్లా డోన్‌లో అమ్మాయిని రోడ్డుపైన ఇబ్బంది పెడుతున్న సుభాన్ సంఘటన 2022లో జరిగింది, ఇప్పుడు కాదు.