“అహ్మదాబాద్‌లో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా దాడి చేసి, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ముస్లింలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి రోడ్లవెంట ఊరేగించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్డుపై నడుపిస్తున్న దృశ్యాలను, ఓ యువకుడిని లాఠీతో పోలీసులు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో క్లిప్ ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అహ్మదాబాద్‌లో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా దాడి చేసిన ముస్లింలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై ఊరేగించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 13 మార్చి 2025వ రాత్రి అహ్మదాబాద్‌లోని వస్త్రల్ ప్రాంతంలో వాహనాలపై దాడి చేసిన నిందుతులను పోలీసులు అరెస్టు చేసి 13 మార్చి 2025వ తేదీన రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. వస్త్రల్‌లో జరిగిన ఈ హింస వ్యక్తిగత శత్రుత్వం కారణంగా జరిగిందని పోలీసులు X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై FIR నమోదు చేసిన రామోల్ పోలీసులు Factly తో మాట్లాడుతూ, “ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు, ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల్లో ఎవరు ముస్లింలు లేరు” అని చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, అహ్మదాబాద్‌లో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా దాడి చేసిన ముస్లింలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై ఊరేగించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, అహ్మదాబాద్‌లోని వస్త్రల్ ప్రాంతంలో కర్రలు, రాడ్లతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ధ్వంసం చేస్తూ హింసకు పాల్పడిన వ్యక్తులను అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేసి, వారిని బహిరంగంగా శిక్షించారని పేర్కొంటూ వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 15 మార్చ్ 2025న ‘మింట్’ ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనాల ప్రకారం, హోలీకి ఒక రోజు ముందు అనగా 13 మార్చి 2025న, సుమారు 20 మంది వ్యక్తులతో కూడిన గుంపు ఒక SUV యజమానిపై దాడి చేశారు, అలాగే కత్తులు, కర్రలతో సమీపంలోని వాహనాలను కూడా ధ్వంసం చేశారు, ఈ దాడిలో పాల్గొన్న కనీసం 14 మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. “వస్త్రాల్‌లోని ఒక వాణిజ్య సముదాయం సమీపంలో ఒక ఫుడ్ స్టాల్ తెరవడంపై ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న శత్రుత్వం కారణంగానే ఈ హింస జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది” అని అహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బల్దేవ్ దేశాయ్ వార్త సంస్థ పిటిఐకి చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాలు కూడా వ్యక్తిగత శత్రుత్వం వల్లనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నాయి. ఈ కథనాల ప్రకారం, అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలో తోపుడు బండి ఉంచడంపై పంకజ్ భావ్‌సర్, సంగ్రామ్ సికార్వార్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం ఈ సంఘటనకు దారితీసింది. 13 మార్చ్ 2025 రాత్రి భావ్‌సర్, ఒక మైనర్‌తో సహా మరో 14 మందితో కలిసి వస్త్రల్‌కు చేరుకుని, సికార్వర్ ఎప్పుడూ కూర్చునే దుకాణం వెలుపల పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. తరువాత, వారు వీధుల్లోకి చొరబడి ప్రయాణికులు, స్థానికులపై ఆయుధాలతో దాడి చేశారు.
15 మార్చి 2025న ప్రచురించబడిన గుజరాత్ సమాచార్ కథనం ప్రకారం , వస్త్రల్‌లో జరిగిన హింసకు ప్రతిస్పందనగా, ఈ దాడిలో పాల్గొన్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు, వారిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఈ దాడిలో అల్దీప్ మౌర్య, శ్యామ్ కమ్లి, వికాస్ అలియాస్ బిట్టు పరిహార్, అశిల్ మక్వానా, రోహిత్ అలియాస్ దుర్లభ్ సోనావానే, నిఖిల్ చౌహాన్, మయూర్ మరాఠీ, ప్రదీప్ అలియాస్ మోను తివారీ, రాజ్‌వీర్ సింగ్ బిహోలా, అల్కేష్ యాదవ్, ఆయుష్ రాజ్‌పుత్, దినేష్ రాజ్‌పుత్, దీపక్ కుష్వాహా నిందుతులుగా ఉన్నారని ఈ కథనం పేర్కొంది. పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిని బహిరంగంగా ఊరేగిస్తూ లాఠీలతో కొడుతూ, ప్రజలకు క్షమాపణలు చెప్పించారు, అలాగే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారాలు, శ్యామ్ కమ్లి, ఆశిల్ మక్వానా, రోహిత్ అలియాస్ దుర్లభ్ సోనావానే, రాజ్‌వీర్ సింగ్ బిహోలా, అల్కేష్ యాదవ్, ఆయుష్ రాజ్‌పుత్‌లతో అనే ఏడుగురు నిందితుల అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని ఈ కథనం పేర్కొంది. ఈ ఘటనలో మతపరమైన కోణం ఉందని లేదా నిందితులలో ముస్లింలు ఉన్నారని వార్తాకథనాలు ఏవీ పేర్కొనలేదు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై 14 మార్చి 2025న అహ్మదాబాద్ పోలీసులు X(ట్విట్టర్)లో చేసిన పోస్టు ఒకటి లభించింది. “వస్త్రల్‌లో జరిగిన హింస వ్యక్తిగత శత్రుత్వం కారణంగా జరిగింది, ఈ సంఘటన గురించి సమాచారం అందుగానే రామోల్ పోలీసు ఇన్‌స్పెక్టర్, పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై FIR నమోదు చేసి, ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేశారు” అని ఈ పోస్టు పేర్కొంది.
తదుపరి మేము ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి గుజరాత్ పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి రామోల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. ఈ ఘటనలో నమోదైన FIR ప్రకారం, మొత్తం 20 మంది ఈ దాడిలో పాల్గొన్నారు, అలాగే నిందుతులలో ఎవరు ముస్లిం మతానికి చెందిన వారు లేరని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం రామోల్ పోలీసులను మేము సంప్రదించగా, మాతో (Factly) మాట్లాడుతూ వారు, “ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు, ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల్లో ఎవరు ముస్లింలు లేరు, ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది” అని చెప్పారు.
చివరగా, ఈ వైరల్ వీడియో 13 మార్చి 2025వ రాత్రి అహ్మదాబాద్‌లోని వస్త్రల్ ప్రాంతంలో వాహనాలపై దాడి చేసిన నిందుతులను పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటనలో నిందితులు ముస్లిం మతానికి చెందిన వారు కాదు.