Fake News, Telugu
 

హత్రాస్ బాధితురాలి తండ్రిని హత్య చేసింది గౌరవ్ శర్మ అనే నిందితుడు, పోలీసులు కాదు

0

కూతురుని వేధిస్తున్నారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేసిన యూపి లోని హత్రాస్ పోలిసులు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తన తండ్రిని అన్యాయంగా చంపారని, తనకు న్యాయం చేయాలనీ ఒక మహిళ ప్రాధేయపడుతున్న దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కూతురుని వేధిస్తున్నారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపిన హత్రాస్ పోలిసులు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో ప్రాధేయపడుతున్న మహిళ తండ్రిని గౌరవ్ శర్మ అనే వ్యక్తి 01 మార్చ్ 2021 నాడు కాల్చి చంపాడు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి తండ్రి అమ్రిష్, తన కూతురిని గౌరవ్ శర్మ లైంగికంగా వేదిస్తున్నాడని 2018లో కేసు పెట్టాడు. బెయిల్ మీద బయటికొచ్చిన గౌరవ్ శర్మ 01 మార్చి 2021 నాడు అమ్రిష్ ని కాల్చి చంపేసాడు. ఈ హత్య హత్రాస్ పోలీసులు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోకి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో ‘ Hathras victim father killed’ అనే కీ  పదాలతో వెతికితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ చేస్తూ ‘The Times of India’ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో తన కూతురిని లైంగికంగా వేదిస్తున్నాడని ఒక తండ్రి కేసు పెట్టినందుకు అతన్ని నిందితుడు కాల్చి చంపినట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తులని అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులని, ప్రజలని ప్రాధేయపడుతున్న వీడియో ఇదని ఆర్టికల్ లో తెలిపారు. ఈ వీడియోలో నిందితుడి పేరు గౌరవ్ శర్మ అని ఆ మహిళ చెప్పడం గమనించవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అమ్రిష్ అనే వ్యక్తి, తన కూతురిని గౌరవ్ శర్మ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని 2018లో కేసు పెట్టినట్టు ఆర్టికల్స్ లో తెలిపారు. ఈ కేసులో శిక్ష అనుభవించిన గౌరవ్ శర్మ, బెయిల్ మీద బయటికొచ్చి అమ్రిష్ ని చంపేసినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఘటన 01 మార్చి 2021 నాడు హత్రాస్ సమీపంలోని నౌజార్పుర్ గ్రామంలో చోటుచేసుకుంది. ‘ANI’ ఈ ఘటనకు సంబంధించిన వివరాలని ట్వీట్ చేసింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలని ప్రముఖ తెలుగు ఛానెల్స్ కూడా రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ కేసులో నిందితుడైన ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు హత్రాస్ పోలీస్ ట్వీట్ చేసారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలని తెలుపుతూ హత్రాస్ SP ఒక వీడియో రిలీజ్ చేసారు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో ప్రాధేయపడుతున్న మహిళ తండ్రిని హత్రాస్ పోలీసులు చంపలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హత్రాస్ లో కూతురిని వేధిస్తున్నాడని కేసు పెట్టినందుకు తండ్రిని చంపేసింది గౌరవ్ శర్మ అనే నిందితుడు, పోలీసులు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll