01 అక్టోబర్ 2025న ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.100 నాణెం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా, మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో“నెదర్లాండ్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన పోస్టల్ స్టాంప్” అంటూ ఓ పోస్టల్ స్టాంప్ (తపాలా బిళ్ల) ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం విడుదల చేసిన RSS స్మారక పోస్టల్ స్టాంప్ (తపాలా బిళ్ల) యొక్క ఫోటో.
ఫాక్ట్(నిజం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను (తపాలా బిళ్ల) విడుదల చేసిందనే వాదనలో నిజం లేదు. ఈ పోస్టల్ స్టాంప్‌ను, RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా 09 అక్టోబర్ 2025న నెదర్లాండ్స్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS NL) విడుదల చేసింది. నెదర్లాండ్స్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమకు కావలసిన ఫోటోలతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను తయారు చేసుకోవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు.
ఈ క్రమంలోనే, ఈ పోస్టల్ స్టాంప్‌ను నెదర్లాండ్స్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS NL) అనే సంస్థ విడుదల చేసినట్లు తెలిసింది (ఇక్కడ). ఈ పోస్టల్ స్టాంప్‌ను, RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా 09 అక్టోబర్ 2025న నెదర్లాండ్స్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS NL) విడుదల చేసింది.

నెదర్లాండ్స్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమకు కావలసిన ఫోటోలతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను తయారు చేసి, వాటిని ఉపయోగించవచ్చు(ఇక్కడ). ఇందుకోసం వారు సంబంధిత ఫోటోను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుము చెల్లించాలి.

ఇలాంటి కస్టమైజ్డ్ పోస్టల్ స్టాంప్‌లను భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా అందిస్తుంది (ఇక్కడ, ఇక్కడ), అందుకు సంబంధించి Factly ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, RSS శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను (తపాలా బిళ్ల) విడుదల చేసిందనే వాదనలో నిజం లేదు.