త్రిపురలో ముస్లిం నివాసాలకు హిందువులు నిప్పంటించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. త్రిపురలో ఇటీవల హిందూ-ముస్లింల ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: త్రిపురలో ముస్లిం నివాసాలకు హిందువులు నిప్పంటించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, మర్చి 2021లో బంగ్లాదేశ్ బలుఖాలి రోహింగ్య క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోకి త్రిపుర మత ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని చాల మంది ఫేస్‌బుక్ యూసర్లు 2021 మార్చ్ నెలలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బంగ్లాదేశ్ బలుఖాలి రోహింగ్య క్యాంపులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగిన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని మరియు ఫోటోని ‘The Rohingya Post’, బంగ్లాదేశ్ ‘UNHCR’ సంస్థ తమ సోషల్ మీడియా పేజీలలో ఇదే వివరణతో షేర్ చేసాయి.
22 మార్చి 2021 నాడు బంగ్లాదేశ్‌లోని బలుఖాలి రోహింగ్య శరణార్ధ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో వేల సంఖ్యలో ఇళ్లు కాలిపోయినట్టు బంగ్లాదేశ్ న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో బంగ్లాదేశ్‌కి సంబంధించిందని, త్రిపుర మత ఘర్షణలకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, బంగ్లాదేశ్ రోహింగ్య క్యాంపులో భారీ మంటలు చెలరేగిన పాత వీడియోని త్రిపుర మత ఘర్షణలకు ముడిపెడుతున్నారు.