Fake News, Telugu
 

ప్రధాన మంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ₹6,000 నుండి ₹10,000కి పెంచలేదు

0

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు 2026 న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుండి ₹10,000 కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ క్లిప్ వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుండి ₹10,000 కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుంది – ఎన్టీవీ వార్త కథనం. 

ఫాక్ట్(నిజం): ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుంచి ₹10,000కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందనే వాదనలో నిజం లేదు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద, ప్రభుత్వం ప్రస్తుతం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ వీడియోను NTV తెలుగు ఛానల్ ఇటీవల ప్రసారం చేయలేదు; వారు ఈ వీడియోను 01 జనవరి 2025న ప్రచురించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో 01 జనవరి 2025న NTV తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించబడిందని కనుగొన్నాము. దీని ఆధారంగా, వైరల్ వీడియోలో తెలిపిన సమాచారం ఇటీవలి వార్త కాదని, పాత వీడియో ఇప్పుడు షేర్ చేయబడుతుందని తెలుసుకున్నాము.

వైరల్ వీడియోలలో చెప్పినట్లుగా, ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుండి ₹10,000 కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా భారత ప్రభుత్వ వర్గాలు ఇలాంటి ఆర్థిక సహాయంలో పెంపు జరిగిందని ప్రకటించి ఉంటే, పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా ఆ విషయం గురించి కథనాలు ప్రచురించేవి.

అలాగే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాము, వైరల్ వీడియోల్లో చెప్పినట్లుగా ఆర్థిక సహాయంలో పెంపు జరిగిందని ప్రకటిస్తూ ఎలాంటి సమాచారం లభించలేదు.

తదుపరి, మేము భారత ప్రభుత్వ స్కీమ్‌ల గురించి సమాచారం అందించే MyScheme వెబ్‌సైట్‌ను సమీక్షించగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ప్రస్తుతం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్ప్రభుత్వం సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయాన్ని, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000 మూడు విడతలుగా అందిస్తోంది అని మేము కనుగొన్నాము. చివరగా ఈ స్కీమ్‌ కింద 19 నవంబర్ 2025 న 21వ ఇన్‌స్టాల్మెంట్‌ కింద రూ. 2000 అందించారు. 

చివరిగా, ప్రధాన మంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ₹6,000 నుండి ₹10,000కి పెంచలేదు.

Share.

About Author

Comments are closed.

scroll