Fake News, Telugu
 

ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి యోగి ఆదిత్యనాథ్‌ను పంపమని జర్మనీ మంత్రి ట్వీట్ చేయలేదు

0

ఇటీవల ఫ్రాన్స్‌లో ఒక యువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన కారణంగా అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో, ఫ్రాన్స్‌లో ఉన్మాదాన్ని అణచివేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ను  ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ జర్మన్ మంత్రి జాన్ ట్వీట్ చేశారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ జర్మన్ మంత్రి జాన్ ట్వీట్ చేశారు.

ఫాక్ట్: యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ ట్వీట్ చేసిన వ్యక్తి జర్మనీ మంత్రి కాదు, ఎన్ జాన్ కామ్ అనే ఒక డాక్టర్. ఈ పేరుతో జర్మన్ కేబినెట్లో ఎటువంటి మంత్రి లేరు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ పోస్టులో ఉన్న ఫోటో ఆధారంగా, ‘Prof. N John Camm’ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను మేము పరిశీలించాం. ఇందులో 30 జూన్ 2023 న ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ ట్వీట్ చేసి ఉండడం గమనించాం. ఇదే ట్వీట్‌ను బదులిస్తూ, “ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం అల్లర్లకు ఆజ్యం పోసినప్పుడల్లా, గందరగోళం చెలరేగుతుంది మరియు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలు తలెత్తుతాయి. అటువంటి సమయంలో ప్రపంచమంతా ఉత్తర ప్రదేశ్లో యోగి అదిత్యనాథ్ స్థాపించిన ‘యోగి మోడల్’ కావాలని కోరుకుంటుంది”, అని యోగి అదిత్యనాథ్ కార్యాలయం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా పేర్కొంది.

అయితే తన ట్విట్టర్ బయోలో తాను జర్మనీలో ఉండే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ మరియు జాన్ కామ్ అనే సంస్థకు చైర్మన్‌ని అని పేర్కొన్నారు. ఇదే ట్వీట్‌ను ఎక్కడా కూడా తాను జర్మనీ మంత్రిని అని చెప్పలేదు. పైగా, జర్మనీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం జాన్ కామ్ పేరుతో జర్మన్ కేబినెట్లో ఎటువంటి మంత్రి లేరు.

అయితే, తన ట్విట్టర్ బయోలో వెల్లడించిన వివరాలను ఆధారంగా పరిశోధించగా ఆయన పూర్తి పేరు ‘నరేంద్ర జాన్ కామ్’ అని గుర్తించాం.

మరియు తన వెబ్‌సైట్లో తను సర్జరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోని కూడా ఇక్కడ చూడవచ్చు.

అయితే ఇతని అసలు పేరు ‘నరేంద్ర విక్రమాదిత్య యాదవ్’ అని, అతని పై ఇదివరకే క్రిమినల్ కేసులు ఉన్నాయని పలువురు డాక్టర్లు, జర్నలిస్ట్లు పేర్కొనగా ఎన్ జాన్ కామ్ ఆ ఆరోపణలను ఖండిస్తూ తనకు  నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తితో ఎటువంటి సంబంధం లేదని, ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వారికి లీగల్ నోటీసులు పంపారు.

అలాగే, ది హిందూ పత్రిక వారు ‘ఎన్ జాన్ కామ్’ ను సంప్రదించగా తాను ఎప్పుడూ పేరు మార్చుకోలేదని చెప్పినట్లు, అలాగే చికాగోలో చేసిన ఒక ఫెలోషిప్ సర్టిఫికేట్ మినహా ఎటువంటి వ్యక్తిగత డాక్యుమెంట్లు తమకు పంపలేదని, హిందూ పత్రిక పేర్కొంది.

ఇక ఇదే విషయంపై మరింత స్పష్టత కోసం మేము ‘ఎన్ జాన్ కామ్’ మరియు అతను పని చేసిన ఆసుపత్రి యాజమాన్యాలను సంప్రదించాం. తగిన సమాచారం లభించిన తర్వాత ఈ ఆర్టికల్ సవరించబడుతుంది.

చివరిగా, ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ జర్మని మంత్రి ట్వీట్ చేశాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll