Fake News, Telugu
 

వికారాబాద్‌లో ల్యాండ్ అయిన పరికరం ఏలియన్ వాహనమో లేక టైమ్ మెషిన్ కాదు; అది ఒక స్పేస్ కాప్సూల్ నమూనా

0

వికారాబాద్ జిల్లాలో టైమ్ మెషిన్‌ లాగా ఉండే ఒక వింత శకటం ఆకాశం నుంచి ఊడిపడిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ప్రచారంలో ఉంది. అలాగే, హైదరాబాద్‌లో కూడా 07 డిసెంబర్ ఉదయం ఒక భారీ బెలూన్ కూడా ఆకాశంలో కనిపించడం గురించి అనేక పుకార్లు వస్తున్నాయి. ఈ ప్రచారాలలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్‌లో ఆకాశంలో కనిపించిన ఏలియెన్స్ వాహనం. వికారాబాద్ జిల్లాలో టైమ్ మెషిన్ లాగా ఉండే ఒక వింత పరికరం ఆకాశం నుంచి ఊడిపడింది.

ఫాక్ట్: హైదరాబాద్ లో ఉన్న ‘Tata Institute of Fundamental Research, Ballon Facility’ 07 డిసెంబర్ 2022 తెల్లవారు జామున ఒక పెద్ద హైడ్రోజన్ బెలూన్ కి పేలోడ్ గా Halo Space అనే కంపెనీకి చెందిన స్పేస్ కాప్సుల్ నమూనాని జత చేసి ఆకాశంలోకి పంపించారు. ఈ స్పేస్ కాప్సుల్ ద్వారా భవిష్యత్తులో మనుషులుకు అంతరిక్ష పర్యాటకం సాధ్యం అవుతుంది అని కంపెనీ చెప్తుంది. దీనిలో భాగంగా జరిగిన ప్రయోగంలో తగినంత ఎత్తుకు చేరుకున్న తరువాత స్పేస్ కాప్సూల్ ను బెలూన్ నుంచి విడిపోయేలా చేసి తిరిగి భూమి మీద పారాషూట్ సహాయంతో జనావాసాలు లేని ప్రదేశంలో GPS ట్రాకింగ్ ను ఉపయోగించి వికారాబాద్ వద్ద లాండ్ అయ్యేలా చేశారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా హైదరాబాద్ లో 07 డిసెంబర్ 2022 ఉదయం కనిపించిన ఈ బెలూన్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఇది హైదరాబాద్ లోని ECIL ప్రాంతంలో ఉండే “Tata Institute of Fundamental Research, Balloon facility” వారు తెల్లవారు జామున ప్రయోగించిన హైడ్రోజన్ బెలూన్ అని ఆ సంస్థ ప్రతినిధి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సంస్థ వారు 1956 నుంచి కూడా దేశంలో వివిధ ప్రదేశాల నుంచి ఇటువంటి బాలూన్ లను ఆకాశం లోకి పంపించడం చేస్తున్నారు. ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, అంతరిక్షయానం మొదలగు రంగాలలో ఉపయోగించే సాంకేతిక పరికరాలను పరీక్షించడానికి (లేదా) అంతరిక్షంలోని సమాచారాన్ని సేకరించడానికి ఆయా పరికరాలను ఈ బాలూన్ లకు ‘పేలోడ్’ గా జత చేసి వీరు ప్రయోగిస్తూ ఉంటారు. ఒకసారి ఈ బాలూన్  అనుకున్న ఎత్తుకు చేరుకున్న తరువాత బాలూన్ నుంచి  పేలోడ్ ని  విడిపోయేలా చేస్తారు. అప్పుడు పారాషూట్ సహాయంతో పేలోడ్ తిరిగి భూమి పైకి చేరుకుంటుంది.

ఈ ప్రక్రియలో భాగంగా జనావాసాలకు దూరంగా పేలోడ్ ని పడేలా చూస్తారు. ఆ సంస్థ సిబ్బంది ఎప్పటికప్పుడు దానిని GPS ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఒకసారి భూమి పైనకి వచ్చిన తర్వాత, దానిని వారు తిరిగి సంబంధిత సంస్థకి పంపిస్తారు.

ఇలాంటి ఒక ప్రయోగం చేయడానికే స్పెయిన్  దేశానికి చెందిన “Halo Space” అనే ఒక కంపెనీ తమ స్పేస్ కాప్సుల్ నమూనాని పరీక్షించడానికి  హైదరాబాద్లో ఉన్న ఈ TIFR Balloon Facility నుంచి డిసెంబర్ 07న ప్రయోగించింది. “Halo Space” అనే కంపెనీ స్పేస్ టూరిజానికి చెందిన ఒక కంపెనీ. తాము రూపొందించిన స్పేస్ కాప్సూల్ సహాయంతో ఒకేసారి 8 మంది మనుషులని భూమి నుండి 40 km ఎత్తు వరకు తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా భూమి పైకి తీసుకురావాలి అని ప్రణాళికలు చేస్తుంది. ఇందులో భాగంగానే మనుషులు లేని ఒక కాప్సూల్ ని హైదరాబాద్ నుంచి సాంకేతిక పరీక్షల నిమిత్తం ప్రయోగించారు. ఈ కాప్సూల్ నే బాలూన్ కి పేలోడ్ గా జతచేసి ఆకాశంలోకి పంపించారు. పైన చెప్పినట్లుగానే, తగినంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత, బాలూన్ నుంచి పేలోడ్ ని విడిపోయేలా చేసి తిరిగి భూమి మీదకి జనావాసాలు లేని చోట GPS ట్రాకింగ్ సహాయం తో పడేలా చేస్తారు. వికారాబాద్ జిల్లాలో పడింది ఈ Halo Space కంపెనీ కి చెందిన ఈ కాప్సుల్ నమూనానే. తరువాత TIFR Balloon Facility అధికారులు వచ్చి ఈ కాప్సూల్ ని  విడి భాగలుగా చేసి తీసుకొని వెళ్లారు.

అయితే, ఈ ప్రయోగం గురించి ఎవరికి కూడా సరైన సమాచారం లేకపోవడం వలన మరియు వివిధ వార్తా సంస్థలు ప్రసారం చేసిన సంబంధం లేని దృశ్యాల వలన సోషల్ మీడియాలో అనేక పుకార్లు ప్రచారం అయ్యాయి.

చివరిగా, వికారాబాద్ లో లాండ్ అయిన పరికరం టైమ్ మెషిన్ లేదా ఏలియెన్ మెషిన్ కాదు, అది హైదరాబాద్ నుంచి ప్రయోగించిన Halo Space అనే కంపెనీ యొక్క స్పేస్ కాప్సూల్ నమూనా.

Share.

About Author

Comments are closed.

scroll