Fake News, Telugu
 

14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘gross incompetence’ అని అవమానించారన్న వాదనలో నిజం లేదు

0

ప్రధాని మోదీ ఇటివల ఫిబ్రవరి 2025  రెండు రోజులు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత, ఇద్దరూ ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 2025న భారత కాలమానం ప్రకారం వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. అందులో ట్రంప్‌ “That’s your question, but I’ll answer it. And yeah, I agree with you, gross incompetence” అంటారు. తర్వాత అక్కడున్నవాళ్లు, ఇద్దరు నేతలు కూడా నవ్వడం కనిపిస్తుంది. ఈ వీడియోను ట్రంప్‌ మోదీని అవమానించినట్లు చెబుతూ షేర్‌ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల 14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ‘gross incompetence’(అసమర్థత) అంటూ అవమానించారు, అందుకు సంబంధించిన వీడియో. 

ఫాక్ట్(నిజం):  మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో భారతదేశ సంబంధాల గురించి ఒక రిపోర్టర్ మోదీని ప్రశ్నించగా, ట్రంప్ మోదీ స్పందించకముందే నవ్వుతూ జవాబిచ్చారు. ఆయన గత అమెరికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బలహీనమైన నాయకత్వం వల్ల ప్రపంచం ఎదురుదెబ్బలు తిన్నదని, కానీ తన అధ్వర్యంలో పరిస్థితి మెరుగవుతోందని అన్నారు. అంతేకానీ, ట్రంప్ మోదీని ‘gross incompetence’ (అసమర్థత) అని అనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, 14 ఫిబ్రవరి 2025న “President Trump Hosts a Press Conference with Prime Minister Narendra Modi” అనే శీర్షికతో “The White House” యూట్యూబ్ ఛానల్‌లో ప్రచురించబడిన పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను (ఆర్కైవ్ లింక్) మేము కనుగొన్నాము.

ఈ వీడియో లో 18 నిమిషాల 35 సెకన్ల టైమ్‌స్టాంప్ దగ్గర ఒక రిపోర్టర్ ప్రధాని మోదీని ఇలా ప్రశ్నించాడు: “ముందుగా, ప్రధాన మంత్రి గారికి ఒక ప్రశ్న. మీరు, అధ్యక్షుడు ఇద్దరూ ISISను ఎదుర్కోవడంపై మాట్లాడారు.ఈ పార్టనర్ షిప్ గురించి ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, శక్తి ద్వారా శాంతి సాధించడానికి, అమెరికాతో విజయవంతమైన పార్ట్నర్షిప్ కొనసాగించడానికి మీకు ఎంత విశ్వాసం ఉంది? గత నాలుగేళ్లుగా బైడెన్‌ అసమర్థతతో పోలిస్తే మీరు ఎలాంటి మార్పు అనుభవిస్తున్నారు?” (ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించగా).

భారత ప్రధాని స్పందించకముందే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం ఇచ్చారు. “అది మీ ప్రశ్న, కానీ నేను దానికి సమాధానం ఇస్తాను” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. “ అవును gross incompetence (అసమర్థత) (జో బైడెన్‌ను ఉద్దేశించి) “మేము అద్భుతమైన సంబంధాన్ని కొనసాగించబోతున్నాం. గత నాలుగేళ్లుగా అమెరికా బలహీన నాయకత్వంతో వెనక్కి వెళ్లిపోయింది, కానీ కేవలం మూడు వారాల్లోనే మేము మార్పు తీసుకొచ్చాం. మీడియా కూడా దేశం, ప్రపంచం మారిపోయినట్టు పేర్కొంది. భారత ప్రధాని కూడా ఈ మార్పును గుర్తించారు. శక్తివంతమైన, మంచి అమెరికా అందరికీ ఉపయోగకరం. ఈ సంబంధం రెండు దేశాలను మరింత బలంగా మార్చుతుంది” అని ఆయన తెలిపారు. (ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించగా)

US అధికారిక వెబ్‌సైట్ whitehouse.govలో మోదీ-ట్రంప్  జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ట్రాన్స్క్రిప్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. ట్రంప్ భారత ప్రధానమంత్రి గురించి కాకుండా గత ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుంది.

ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, మోదీ-ట్రంప్ మీడియా సమావేశంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ మోదీని ప్రశ్నించగా, ట్రంప్ మోదీ స్పందించకముందే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. గత పాలనపై విమర్శిస్తూ, బలహీనమైన అమెరికా నాయకత్వం వల్ల ప్రపంచం ఎదురుదెబ్బలు తిన్నదని, కానీ తన ఆధ్వర్యంలో పరిస్థితి మెరుగవుతోందని అన్నారు.

చివరిగా, 14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవమానించారన్న వాదనలో నిజం లేదు. 

Share.

About Author

Comments are closed.

scroll