22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, “పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే, ఇండియా టీవీ న్యూస్‌లో ప్రచురితమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పూర్తి జాబితా ప్రకారం, చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారు.
ఫాక్ట్(నిజం): 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే అనే వాదనలో నిజం లేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మరణించారు, మృతుల్లో 25 మంది ముస్లిమేతరులు కాగా, ఒకరు ముస్లిం మతానికి చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే పహల్గామ్ ప్రాంతానికి చెందిన స్థానిక వ్యక్తి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
2025 ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి గురించి సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి వివరాలను తెలియజేసే ఒక జాబితా రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటూ, ప్రభుత్వ వర్గాలు మృతులు, గాయపడిన వారి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా ప్రకారం, మొత్తం మృతుల్లో 25 మంది ముస్లిమేతరులు కాగా, ఒకరు ముస్లిం మతానికి చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే స్థానిక వ్యక్తి. రిపోర్ట్స్ ప్రకారం, ఓ ఉగ్రవాదిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో ఆదిల్ హుస్సేన్ మరణించాడు. దీన్ని బట్టి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారనే వాదన తప్పు అని స్పష్టమవుతుంది.

అంతేకాకుండా, వైరల్ పోస్టులో ఉన్న జాబితాను ఇండియా టీవీ న్యూస్‌లో ప్రచురించింది అని పేర్కొన్నారు. అయితే, ఇండియా టీవీ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జాబితాను మేము పరిశీలించినప్పుడు, ఇతర మీడియా సంస్థలు ప్రచురించిన జాబితానే ఇండియా టీవీ కూడా ప్రచురించిందని మేము కనుగొన్నాము.
ఈ జాబితా గురుంచి అధికారిక వివరాల కోసం స్థానిక పోలీసులను సంప్రదించాము. వివరాలు అందిన వెంటనే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారనే వాదనలో నిజం లేదు.