ఇటీవల 16వ బ్రిక్స్(BRICS) సమ్మిట్ 22 అక్టోబర్ 2024 నుండి 24 అక్టోబర్ 2024 వరకు రష్యాలోని కజాన్‌లో రష్యా అధ్యక్షతన ‘Strengthening Multilateralism for Just Global Development and Security’ అనే థీమ్‌తో జరిగింది (ఇక్కడ). ఈ సంవత్సరం కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను బ్రిక్స్ కూటమిలో చేరాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు టర్కీ(తుర్కీయే) అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. అమెరికా వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, టర్కీ సెప్టెంబర్ 2024లో అధికారికంగా బ్రిక్స్‌లో చేరడానికి దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో “బ్రిక్స్(BRICS)లో పాకిస్తాన్ మరియు టర్కీ ప్రవేశాన్ని భారతదేశం వీటో చేసి అడ్డుకుంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బ్రిక్స్(BRICS)లో టర్కీ ప్రవేశాన్ని భారతదేశం వీటో చేసి అడ్డుకుంది.
ఫాక్ట్(నిజం): బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం టర్కీ చేసిన బిడ్‌ను భారత్ వీటో చేసి తిరస్కరించిందన్న వాదనలో వాస్తవం లేదు. బ్రిక్స్‌లో టర్కీ ప్రవేశాన్ని భారతదేశం నిరోధించిందని టర్కీకి మాజీ దౌత్యవేత్త, టర్కీ విదేశాంగ విధాన నిపుణుడు సినాన్ ఉల్గెన్ (Sinan Ulgen) జర్మన్ వార్తా సంస్థ బిల్డ్(Bild)తో పేర్కొన్నారని బిల్డ్ కథనం పబ్లిష్ చేసింది. అయితే బిల్డ్ కథనం తన వ్యాఖ్యలను తప్పుగా పేర్కొందని సినాన్ ఉల్జెన్ తర్వాత స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా బ్రిక్స్(BRICS)లో పాకిస్తాన్ మరియు టర్కీ ప్రవేశాన్ని భారతదేశం వీటో చేసి అడ్డుకుందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, భారత్ టర్కీ ప్రవేశాన్ని వీటో చేసింది అని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు.
ఈ క్రమంలోనే, అక్టోబర్ 2024న ప్రచురించబడిన పలు వార్త కథనాలు మాకు 24 లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “బ్రిక్స్‌లో టర్కీ ప్రవేశాన్ని భారతదేశం నిరోధించిందని టర్కీకి మాజీ దౌత్యవేత్త, విదేశాంగ విధాన నిపుణుడు మరియు టర్కీకి చెందిన కార్నెగీ ఫౌండేషన్ డైరెక్టర్ సినాన్ ఉల్గెన్ (Sinan Ulgen) జర్మన్ వార్తా సంస్థ బిల్డ్(Bild)తో పేర్కొన్నారని బిల్డ్ కథనం పబ్లిష్ చేసింది” అని ఈ కథనాలు పేర్కొన్నాయి.
దీని ఆధారంగా 24 అక్టోబర్ 2024న జర్మన్ పత్రిక బిల్డ్ “Erdogan’s BRICS dream shattered; ‘Insider: Failed because of India’.” అనే శీర్షికతో పబ్లిష్ చేసిన కథనాన్ని(ఆర్కైవ్డ్ లింక్) కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, బ్రిక్స్‌లో చేరడానికి టర్కీ దరఖాస్తు చేసింది, NATOలో సభ్య దేశంగా ఉన్న టర్కీ దరఖాస్తు పాశ్చాత్య భాగస్వాములకు కోపం తెప్పించిందని, అంతేకాకుండా, బ్రిక్స్‌లో చేరకుండా టర్కీని భారత్ అడ్డుకుందని, అందుకు కారణం భారత్ శత్రు దేశమైన పాకిస్థాన్‌తో అంకారాకు సత్సంబంధాలు కలిగి ఉండడం అని US థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో టర్కిష్ విదేశాంగ విధాన నిపుణుడు సినాన్ ఉల్గెన్ బిల్డ్‌తో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే, 24 అక్టోబర్ 2024న టిర్కీకి చెందిన మీడియా సంస్థ ‘Turkiye Today’ పబ్లిష్ చేసిన వార్త కథనం(ఆర్కైవ్డ్ లింక్) ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, టర్కీ యొక్క బ్రిక్స్(BRICS) సభ్యత్వాన్ని భారతదేశం తిరస్కరించింది అని తాను పేర్కొన్నట్లు జర్మనీకి చెందిన బిల్డ్(Bild) పత్రిక పబ్లిష్ చేసిన కథనాన్ని టర్కిష్ విశ్లేషకుడు సినాన్ ఉల్గెన్ ఖండించారని తెలిసింది.

టర్కిష్ విదేశాంగ విధాన నిపుణుడు సినాన్ ఉల్గెన్ జర్మన్ వార్తా సంస్థ బిల్డ్ కథనాన్ని ఖండిస్తూ, టర్కీ యొక్క బ్రిక్స్ సభ్యత్వం బిడ్‌ను భారతదేశం తిరస్కరించిందని ఆయన పేర్కొన్నట్లు, టర్కీ దౌత్యపరమైన స్థితికి సంబంధించి తన ప్రకటనలను బిల్డ్ కథనం తప్పుగా పేర్కొంది అని స్పష్టం చేస్తూ, ఉల్జెన్ తన అధికారిక X(ట్విట్టర్)లో 24 అక్టోబర్ 2024న పోస్టు (ఆర్కైవ్డ్ లింక్) చేశాడు. “నేను బ్రిక్స్ గురించి బిల్డ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాను కాని నేను ఇలా చెప్పలేదు. నిజానికి, భారతదేశం టర్కీకి దూరంగా ఉంది కానీ టర్కీ బ్రిక్స్ సభ్యత్వం బిడ్‌ను వీటో చేయవలసిన అవసరం భారతదేశానికి లేదు. ఈ అంశంపై ఓటింగ్ జరగలేదు. భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలు వేగవంతమైన BRICS విస్తరణకు వ్యతిరేకంగా ఉన్నాయి” అని పోస్టు పేర్కొంది( టర్కిష్ నుండి తెలుగులోకి అనువదించగా).
బ్రిక్స్ సభ్యదేశంగా టర్కీ ప్రవేశాన్ని భారత్ వ్యతిరేకిస్తోందన్న వార్తలను టర్కీ తోసిపుచ్చింది పేర్కొంటూ 25 అక్టోబర్ 2024న ‘ది ఎకనామిక్ టైమ్స్’ వార్త కథనాన్ని పబ్లిష్ చేసింది. అలాగే, పలు రిపోర్ట్స్ ప్రకారం, నవంబర్ 2023లో పాకిస్థాన్ బ్రిక్స్‌లో చేరడానికి దరఖాస్తు చేసింది (ఇక్కడ, & ఇక్కడ) . ‘ది ప్రింట్” కథనం ప్రకారం, 16వ బ్రిక్స్ సదస్సులో మోదీ మాట్లాడుతూ భారతదేశం బ్రిక్స్ లో కొత్త భాగస్వాములకు చేరేందుకు సుముఖంగానే ఉందని, అయితే సభ్య దేశాలని ‘ఏకగ్రీవంగా’ ఇందుకు అంగీకరించాలని పేర్కొనట్లు తెలుస్తుంది.
చివరగా, బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం టర్కీ చేసిన బిడ్‌ను భారత్ వీటో చేసి తిరస్కరించిందన్న వాదనలో వాస్తవం లేదు.