కేంద్ర ప్రభుత్వం కొత్తగా డా. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారా కులాంతర వివాహాం (ఇంటర్-కాస్ట్ మ్యారేజ్) చేసుకున్న వారికి రూ.2,50,000 అందిస్తుదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఈ పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కులాంతర వివాహాం చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం డా. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.
ఫాక్ట్(నిజం): కులాంతర వివాహాం చేసుకున్న వారికి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రారంభించింది. ఐతే ప్రస్తుతం అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం చేసే ఈ పథకం అమలులో లేదు. కులాంతర వివాహాని ఆర్ధిక సహాయం పొందాలనుకున్న వారు ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
కులాంతర వివాహాం చేసుకున్న వారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కూడా కల్పించాలనేది ఉద్దేశంతో 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం డా. అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌స్ పథకం ద్వారా రూ. 2,50,000 ఆర్ధిక సహాయం అందించడింది. ఈ పథకాన్ని డా. అంబేద్కర్ ఫౌండేషన్ వారు అమలు చేసారు.
అయితే 01 ఏప్రిల్ 2023 నుండి అంబేద్కర్ ఫౌండేషన్ ఈ పథకాన్ని నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వేరే కేంద్ర ప్రాయోజిత పథకంతో (సెంట్రల్ స్పాన్సేర్డ్ స్కీం) విలీనం చేసింది.
అంతకుముందు అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా నడిచే Dr. Ambedkar Scheme for Social Integration through Inter-Caste Marriages మరియు Dr. Ambedkar National relief to the scheduled castes/scheduled tribe’s victims of atrocities scheme రెండు పథకాలను Protection of Civil Rights Act, 1955 and the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 చట్టాలకు అనుగుణంగా Ministry of Social Justice and Empowerment ద్వారా నడిచే సెంట్రల్ స్పాన్సేర్డ్ స్కీంలతో విలీనం చేసారు. ఈ విలీనం 01 ఏప్రిల్ 2023 నుండి వర్తిస్తుంది.
01 ఏప్రిల్ 2023 తరవాత అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహానికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులను స్వీకరించట్లేదు. కాగా కులాంతర వివాహాని ఆర్ధిక సహాయం పొందాలనుకున్న వారు ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పథకానికి అనుగుణంగా నడిపించే పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఈ సహాయాన్ని పొందడానికి కావలసిన అర్హతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం SC/ST అట్రాసిటీస్ చట్టానికి అనుగుణంగా SC డెవలప్మెంట్ ద్వారా కులాంతర వివాహాం చేసుకున్నవారికి ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం పొందడానికి వివాహమైన జంటల్లోని వధూవరుల్లో ఒకరు తప్పనిసరిగా దళితులై ఉండాలి. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడనికి సంబంధించిన అర్హతలు, విధానం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, కులాంతర వివాహాం చేసుకున్న వారికి అంబేద్కర్ ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయ పథకం ఇప్పుడు అమలులో లేదు.