Fake News, Telugu
 

చింతన్ శివిర్ సభలో కాంగ్రెస్ నేలపై అమర్చినది ఎరుపు రంగు కార్పెట్లు, కాషాయపు రంగు కార్పెట్లు కాదు; పైకప్పుని త్రివర్ణ రంగు వస్త్రాలతో అలంకరించారు

0

చింతన్ శివిర్ పేరిట నిర్వహించిన మీటింగులో కాంగ్రెస్ తమ పార్టీ జెండాలోని తెలుపు, ఆకుపచ్చ రంగులను టెంట్ పైకప్పును అలంకరించడానికి ఉపయోగించి, కాషాయపు రంగు వస్త్రాలని మాత్రం నేలపై అమర్చిన చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. పాకిస్థాన్ జెండా రంగులతో పైకప్పును అలంకరించి, హిందువులు పవిత్రంగా భావించే కాషాయపు రంగుని నేలపై అమర్చి అవమానించారని మరికొందరు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కాంగ్రెస్ చింతన్ శివిర్ సభలో తెలుపు, ఆకుపచ్చ రంగులను టెంటు పైకప్పును అలంకరించడానికి ఉపయోగించి, కాషాయపు రంగు కార్పెట్లని నేలపై అమర్చిన చిత్రం.

ఫాక్ట్ (నిజం): జైపూరులో జరిగిన చింతన్ శివిర్ సభలో కాంగ్రెస్ త్రివర్ణ రంగు వస్త్రాలను టెంట్ పైకప్పు అలంకరణ కోసం ఉపయోగించింది. వీటిలో కాషాయపు రంగు వస్త్రాలను కూడా పైకప్పు అలంకరణ కోసం ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో నేలపై అమర్చినది ఎరుపు రంగు కార్పెట్లు, కాషాయపు రంగు కార్పెట్లు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి కాంగ్రెస్ చింతన్ శివిర్ సభలో తీసిన ఫోటోల కోసం వెతికితే, కాంగ్రెస్ చింతన్ శివిర్ సభలో తీసిన చాలా వరకు ఫోటోలని తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన కొన్ని ఫోటోలలో సభ టెంట్ పైకప్పును త్రివర్ణ రంగు వస్త్రాలతో అలంకరించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సభలో తెలుపు, ఆకుపచ్చ అలాగే, కాషాయం రంగులతో ఉన్న వస్త్రాలను టెంట్ పైకప్పు అలంకరణ కోసం ఉపయోగించారు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న సభ దృశ్యాలని మరొక కోణంలో తీసిన ఒక ఫోటోలో, సభ పైకప్పుపై కాషాయపు రంగు వస్త్రాలని కూడా అమర్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

చింతన్ శివిర్ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన కొన్ని ఫోటోలలో నేలపై అమర్చిన కార్పెట్ ఎరుపు రంగులో కనిపిస్తే, మరికొన్ని ఫోటోలలో కార్పెట్ కాషాయపు రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కార్పెట్ రంగుకు సంబంధించిన స్పష్టత కోసం ‘ఇండియా టుడే’ ఫాక్ట్ -చెకింగ్ సంస్థ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ నారాయణ్ ఓజాను సంప్రదించింది. నారాయణ్ ఓజా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, చింతన్ శివిర్ సభ కోసం త్రివర్ణ రంగు వస్త్రాలని పండల్ లేదా టెంట్ అలంకరణ కోసం ఉపయోగించాము. అలాగే, నేలపై పూర్తి ఎరుపు రంగులో ఉన్న కార్పెట్లని మాత్రమే అమర్చాము. సాధారణంగా వివాహాలు మరియు ఇతర సమావేశాలలో ఉపయోగించే తివాచీలు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. మా విషయంలో, ఇది ఎరుపు రంగు”, అని స్పష్టం చేసారు. అంతేకాదు, చింతన్ శివిర్ సభలో ఎరుపు రంగు కార్పెట్ అమర్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఫోటోని నారాయణ్ ఓజా ‘ఇండియా టుడే’కీ షేర్ చేసారు.

చివరగా, చింతన్ శివిర్ సభలో కాంగ్రెస్ త్రివర్ణ రంగు వస్త్రలని టెంటు పైకప్పు అలంకరణ కోసం ఉపయోగించింది. అలాగే, ఈ సభలో నేలపై అమర్చినది ఎరుపు రంగు కార్పెట్, కాషాయం రంగు కార్పెట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll