కెనడా, అమెరికా దేశాల మధ్యలో ఉన్న ఒక వంతెన ఫోటో అని చెప్తున్న గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వంతెనకు కుడి వైపు కెనడా దేశం ఉంటే ఎడమవైపు అమెరికా ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: వైరల్ ఫొటోలో కనిపిస్తున్న వంతెనకు కుడి వైపు కెనడా దేశం ఉంది, ఎడమ వైపు అమెరికా దేశం ఉంది.
ఫ్యాక్ట్: ఈ బ్రిడ్జి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న జావికోన్ ఐలాండ్‌లో ఉన్న రెండు దీవుల మధ్య ఉంది. ఈ రెండూ కెనడా భూభాగంలోనే ఉన్నాయి, ఒకటి అమెరికా, ఒకటి కెనడాలో కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, వైరల్ గ్రాఫిక్‌లో ఉన్న ఫోటోపై ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ బ్రిడ్జి కెనడాలోని ఒంటారియోలో ఉన్న జావికోన్ ఐలాండ్‌కి, ఇంకో ఒక చిన్న ఐలాండ్‌కి మధ్యలో ఉందని చెప్తున్న కొన్ని ఆర్టికల్స్ మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ).

అమ్యూజింగ్ ప్లానెట్ వారు కెనడా-అమెరికా బోర్డర్ ప్రాంతంలో ఉన్న 1000 ఐలాండ్స్ ద్వీప సముదాయాన్ని గురించి ప్రచురించిన ఒక కథనంలో వైరల్ ఫొటోలో ఉన్న బ్రిడ్జి ఉంది. ఈ ద్వీప సముదాయం సెయింట్ లారెన్స్ నదిలో ఉందని ఇందులో పేర్కొన్నారు.
ఐలాండ్‌లు ఉన్న 1000 ఐలాండ్స్ ద్వీప సముదాయం గురించి 1000isalndstourism.com వారు ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో, జావికోన్ ఐలాండ్‌లో ఉన్న రెండు ద్వీపాల్లో ఒకటి కెనడాలో ఒకటి అమెరికాలో ఉంది అనే పుకారు ఉందని, కానీ అది నిజం కాదు, రెండూ కెనడా భూభాగంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సమాచారాన్ని ఆదరంగా తీసుకొని, జావికోన్ ఐలాండ్ గురించి గూగుల్ మ్యాప్స్‌లో వెతుకగా, జావికోన్ ఐలాండ్ కెనడా దేశంలో ఉందని మాకు తెలిసింది. ఈ బ్రిడ్జి ఉన్న రెండు ఐలాండ్‌లు (రెండు జావికోన్ ఐలాండ్‌లో భాగం) కెనడాలోనే ఉన్నాయి, ఒకటి కెనడా, ఒకటి అమెరికాలో కాదు.

అలాగే, కెనడా దేశం వారి Canadaian Geographical Names Database (CGNDB)లో జావికోన్ ఐలాండ్ గురించి వెతకగా, ఇది కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో లీడ్స్ అనే ప్రాంతంలో ఉందని మాకు తెలిసింది. అంటే వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిములో లాగా, బ్రిడ్జికి ఒక పక్క కెనడా, ఒక పక్క అమెరికా లేవు. రెండు ద్వీపాలు (ఐలాండ్‌లు) కెనడాలోనే ఉన్నాయి.

ఇక ఈ విషయంపై వివరణ కోరుతూ ప్రముఖ ఫ్యాక్ట్-చెక్ సంస్థ Snopes వారు కెనడా ప్రభుత్వం యొక్క ప్రతినిధి Alexandre Baillairgé-Charbonneauను సంప్రదిచగా, ఈ బ్రిడ్జి కెనడా సరిహద్దుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
చివరగా, ఈ వైరల్ ఫొటోలో కనిపిస్తున్న వంతెన కెనడా దేశంలోని ఒంటారియోలో ఉంది, కెనడా-అమెరికా దేశాల మధ్య కాదు.