ఇటీవల ఎన్నికల కమిషన్ ఎలెక్టోరల్ బాండ్‌ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాలకు సంబంధించిన సమాచారం తమ వెబ్సైటులో పెట్టిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలోనే ఎలెక్టోరల్ బాండ్‌ల ద్వారా BJP కన్నా ప్రతిపక్ష పార్టీలే ఎక్కువ విరాళాలు పొందయంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). 303 ఎంపీలు ఉన్న BJP 6000 కోట్లు ఎలెక్టోరల్ బాండ్‌ల ద్వారా పొందగా, 242 ఎంపీలు ఉన్న ప్రతిపక్షానికి 14,000 కోట్లు విరాళాలుగా వచ్చాయని ఈ పోస్టులో వాదిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 303 ఎంపీలు ఉన్న BJP 6000 కోట్లు ఎలెక్టోరల్ బాండ్‌ల ద్వారా పొందగా, 242 ఎంపీలు ఉన్న ప్రతిపక్షానికి 14,000 కోట్లు విరాళాలుగా వచ్చాయి.
ఫాక్ట్(నిజం): ఎలక్టోరల్ బాండ్ పథకం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ పార్టీలు అందుకున్న రాజకీయ విరాళాల మొత్తం విలువ రూ. 16,492 కోట్లు. ఇందులో అత్యధికంగా BJP దాదాపు రూ. 8,251 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందింది. మిగిలిన మొత్తం ఇతర పార్టీలకు చేరాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ మొత్తం రూ. 20,000 కోట్ల ఎలెక్టోరల్ బాండ్‌ల విరాళాలలో BJPకు రూ. 6,000 కోట్ల విలువైన బాండ్లు అందాయని, మిగతావి ప్రతిపక్ష పార్టీలకు అందాయని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్త అమిత్ షా వ్యాఖ్యల అనంతరం మొదలైందే. ఐతే ఇప్పటివరకు ఏ పార్టీకు ఎంత విరాళాలు అందాయో అన్న వివరాలు కింద చూద్దాం.
ఎలెక్టోరల్ బాండ్‌లు:
కేంద్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో ఎలక్టోరల్ బాండ్‌ల పథకాన్ని మొదటసారిగా ప్రకటించింది, ఆ పథకం తరువాత జనవరి 2018లో నోటిఫై చేయబడింది. అప్పటి నుండి వివిధ రాజకీయ పార్టీలు ECIకి సమర్పించే వార్షిక ఆడిట్ రిపోర్ట్‌లలో తాము పొందిన ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందించాయి.
ఇది కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, ఎన్నికల కమిషన్ నవంబర్ 2023 నాటికి వివిధ పార్టీలు అందుకున్న ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో వెల్లడించింది. కాగా ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారంలో (SBI సమర్పించిన డేటా) 12 ఏప్రిల్ 2019 నుండి 24 జనవరి 2024 మధ్య కాలంలో వివిధ పార్టీలు పొందిన విరాళాల వివరాలు ఉన్నాయి. ఈ మూడు సోర్సుల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని కలిపి విశ్లేషించగా ఈ పథకం మొదలైనప్పటి నుండి ఏ పార్టీకు ఎంత విరాళాలు పొందిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.
Year | Source |
2017-18 నుండి 2022-23 | రాజకీయ పార్టీల వార్షిక ఆడిట్ రిపోర్ట్‌లు |
12 April 2019 నుండి 24 January 2024 | ఇటీవల SBI ఎన్నికల కమిషన్‌కు అందించిన ఎలక్టోరల్ బాండ్‌ల వివరాలు |
Nov 2023 నాటికి | సుప్రీంకోర్టు రిజిస్ట్రీ |
అంతకుముందు RTI ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ రాజకీయ పార్టులు కలిపి రూ. 16,492 కోట్ల మొత్తాన్ని విరాళాలుగా పొందాయి. కాగా పైన అందించిన మూడు సోర్సుల సమాచారం ప్రకారం మాత్రం ఈ విలువ రూ. 16,488.2 కోట్లని తేలింది. ఈ రెండు పద్దతుల్లో దాదాపు నాలుగు కోట్ల వరకు స్వల్ప వ్యత్యాసం ఉంది.
ఇందులో అధికంగా ఉన్న రూ. 16,492 కోట్లని పరిగణలోకి తీసుకున్నా కూడా ఇప్పటివరకు రాజకీయ పార్టీలు బాండ్ల ద్వారా పొందిన మొత్తం విలువ క్లెయిమ్ చేసిన రూ. 20,000 కోట్ల కన్నా తక్కువే ఉంది. ఇదిలా ఉండగా ఈ మొత్తంలో BJPకు రూ. 8251 కోట్లు బాండ్ల రూపంలో అందాయి, అమిత్ షా చెప్పినట్టు 6,000 కోట్లు కాదు.
అంటే మొత్తం బాండ్ల విలువలో BJP అన్ని పార్టీల కంటే అధికంగా సుమారు 50.04% పొందింది. ఇప్పటివరకు ఏయే పార్టీ ఎంత విరాళాలు పొందిందో కింది టేబుల్‌లో చూడొచ్చు.
కాగా ఎలక్టోరల్ బాండ్‌లు మొదలైనప్పటి నుండి ఏ సంవత్సరం ఏ పార్టీ ఎంత విరాళాలు పొందిందో అన్న సమాచారం కింది టేబుల్‌లో చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు ఎలక్టోరల్ బాండ్‌లలో సగం BJP పొందగా, మిగిలిన మొత్తం ఇతర పార్టీలకు చేరాయని తెలుస్తుంది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే BJP మినహా అన్ని పార్టీలు ప్రతిపక్షం కాదు. ఇందులో కొన్ని పార్టీలు BJPతో పొత్తులో ఉండగా, కొన్ని పార్టీలు గతంలో పొత్తులో ఉండి, ఇప్పుడు బయటకు వచ్చాయి.
చివరగా, ఇప్పటివరకు మొత్తం రూ. 16,492 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు రాగా, అందులో సగానికిపైగా బీజేపీకి అందాయి.