Fake News, Telugu
 

రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబం తిరిగి ఆ రుణం చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా నిజం కాదు

0

రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రుణం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది  (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రుణం చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫాక్ట్(నిజం): రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, ఆ రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా నిజం కాదు. రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, బ్యాంకులు అతని చట్టపరమైన వారసులను ఆ రుణాన్ని చెల్లించమని కోరవచ్చు. అయితే, అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసుల ఆస్తి పొందినప్పుడే మాత్రమే వారు అతని అప్పులకు బాధ్యులు అవుతారు. వారు పొందుతున్న ఆస్తి కంటే అప్పు ఎక్కువైతే, వారు పొందుతున్న ఆస్తికి సమానమైన రుణ మొత్తానికి మాత్రమే వారు బాధ్యలు అవుతారు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసుల ఆస్తి పొందకపోతే వారు అతని అప్పులకు బాధ్యులు అవరు. ఇవన్నీ లోన్ అగ్రిమంట్ లో రాసుకున్న నిబంధనలు మీద ఆధారపడి ఉంటాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో చెప్పినట్లుగా రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, ఆ రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా వాస్తవం కాదు.

ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకున్న తరువాత అది కట్టకుండానే మరణిస్తే, బ్యాంక్​లు, రుణసంస్థలు రుణ వసూలుకు చట్టపరంగా ముందుకు వెళ్తాయి. రుణం తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత ఆ రుణం తిరిగి చెల్లించడానికి ప్రతి రుణానికి ఒక భిన్నమైన నియమం ఉన్నది.  గృహ రుణం(హోం లోన్) నిబంధనలు భిన్నంగా ఉంటాయి, అలాగే వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్), వాహన రుణం(వెహికల్ లోన్)కు సంబంధించి రూల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఒక్కో లోన్ విషయంలో నియమనిబంధనలు ఒక్కోలా ఉంటాయి.

వాహన రుణం (వెహికల్ లోన్) తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకు ఆ వ్యక్తి కుటుంబాన్ని సంప్రదిస్తుంది, వారిని బకాయి మొత్తాన్ని చెల్లించమని అడుగుతుంది. అందుకు వారు నిరాకరిస్తే, వాహనాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేసి విక్రయించి రుణ మొత్తాన్ని తిరిగి పొందుతాయి.

గృహ రుణం(హోం లోన్) తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకు రుణానికి ఉన్న హామీదారుని లేదా చట్టపరమైన వారసులను సంప్రదిస్తుంది. వాస్తవానికి చాల వరకు బ్యాంకుల గృహ రుణం తీసుకునే సమయంలో బీమా చేయిస్తూ ఉంటాయి. వ్యక్తి మరణిస్తే బీమా ద్వారా బ్యాంక్ రుణాన్ని తిరిగి పొందుతుంది. రుణగ్రహీత గృహ రుణ బీమా కవర్‌ తీసుకుంటే, బీమా క్లెయిమ్‌ మొత్తం నేరుగా బ్యాంకు తీసుకుని బాకీ ఉన్న రుణాన్ని వసూలు చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది. సాధారణంగా, హోం లోన్ తీసుకున్నప్పడు, బ్యాంకు ఇంటి పేపర్లు లోన్ కు బదులుగా తాకట్టులో పెట్టుకుంటుంది. ఒకవేళ రుణానికి భీమా లేకపోయినా, చట్టపరమైన వారసులు బకాయి మొత్తాన్ని చెల్లించదానికి సుముఖంగా లేకపోయినా. ఆ ఇంటిని వేలం వేసి విక్రయించి రుణ మొత్తాన్ని తిరిగి పొందుతాయి. అలాగే, మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది.

వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. ఒకవేళ తీసుకున్న వ్యక్తి రుణ వ్యవధిలో మరణిస్తే, బ్యాంకు ఆ రుణానికి సంబంధించి సహ-రుణగ్రహీత (జాయింట్ హోల్డర్) లేదా వ్యక్తిగత హామీదారుడు ఉన్నట్లయితే బ్యాంకు వారిని సంప్రదించి వసూలు చేస్తుంది. ఒక వేళ సహ-రుణగ్రహీత లేనప్పుడు, బకాయి వసూలుకు ఏ ఇతర అవకాశాలు లేనప్పుడు దాన్ని మొండి బకాయిగా నిర్ధారిస్తారు.

అయితే, కొన్ని సందర్భాల్లో చట్టపరమైన వారసులను ఆ రుణాన్ని చెల్లించమని కోరవచ్చు. అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసుల ఆస్తి పొందినప్పుడే మాత్రమే వారు అతని అప్పులకు బాధ్యులు అవుతారు. వారు పొందుతున్న ఆస్తి కంటే అప్పు ఎక్కువైతే, వారు పొందుతున్న ఆస్తికి సమానమైన రుణ మొత్తానికి మాత్రమే వారు బాధ్యత వహిస్తారు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసుల ఆస్తి పొందకపోతే వారు అతని అప్పులకు బాధ్యులు అవరు. ఇవన్నీ లోన్ అగ్రిమంట్ లో రాసుకున్న నిబంధనలు మీద ఆధారపడి ఉంటాయి.

ఇదే విషయం 17 నవంబర్ 2018న ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ State Bank Of India vs . Neera Devi & Ors. అనే కేసులో ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. ఈ కేసులో రుణం తీసుకున్న వ్యక్తి మరణాంతరం ఆయన వారసులు పలు ఆర్ధిక ప్రయోజలను పొందారని కోర్టులో బ్యాంకు నిరూపించింది. రుణం తీసుకున్న వ్యక్తి మరణాంతరం వచ్చిన పలు ఆర్ధిక ప్రయోజలను అతని వారసులు(ఈ కేసులో భార్య, కూతురు, కొడుకు) పొందారు కాబట్టి అతని అప్పుకు కూడా వారసులు బాధ్యులు అవుతారని  కోర్టు పేర్కొన్నది.

రుణగ్రహీత చనిపోయినప్పుడు, బ్యాంకు అతని చట్టపరమైన వారసులను రుణాన్ని చెల్లించమని అడుగుతుంది, అతని వారసులు మరణించిన వ్యక్తి నుండి ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు లేదా ఆస్తులను పొందకపోతే, రుణగ్రహీత చేసిన అప్పులకు వారు బాధ్యత వహించరు. బ్యాంకు వారి నుండి రుణ మొత్తాన్ని పొందలేదు. ఇదే విషయం మనకి 14 జూలై 2009న ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్  Punjab & Sind Bank vs Sh. Darshan Singh (Deceased అనే కేసులో ఇచ్చిన తీర్పులో తెలుస్తుంది. ఈ కేసులో రుణం తీసుకున్న వ్యక్తి ద్వారా అతని వారసులు ఆర్ధిక ప్రయోజలు లేదా ఆస్తిని పొందారని కోర్టులో బ్యాంకు నిరూపించలేకపోయింది. ఇదే విషయాన్ని కోర్టు పేర్కొంటూ ఆ అప్పుకు వారసులకు ఎలాంటి బాధ్యత లేదని తీర్పు ఇచ్చింది.

చివరగా, రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll