Fake News, Telugu
 

19వ శతాబ్దంలో బ్రాహ్మణులను హిందువులలో భాగంగా పరిగణించేవారు కాదన్న వాదన తప్పు

0

19వ శతాబ్దంలో బ్రాహ్మణులు హిందువులలో భాగం కాదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తమ వాదనకు మద్దతుగా 1872లో ముంబై జనాభా లెక్కలకు సంబందించిన డేటాను కూడా షేర్ చేసారు.  ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 19వ శతాబ్దంలో బ్రాహ్మణులు హిందువులలో భాగం కాదు.

ఫాక్ట్(నిజం): 19వ శతాబ్దంలో నిర్వహించిన జనాభా లెక్కల్లో హిందువులను బ్రాహ్మణులు, ఇతర కులాలు మరియు  హిందువుల నుండి వెలివేయబడిన కులాలు అనే వర్గాలుగా లెక్కించారు. కేవలం బొంబాయి మాత్రమే కాకుండా ఆ కాలంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన జనాభా లెక్కల్లో కూడా ఇలానే చేసారు. ఐతే దీనిని తప్పుగా అర్ధం చేసుకొని, బ్రాహ్మణులు హిందువులలో భాగం కాదంటూ ప్రచారం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న పోస్టులో షేర్ చేసిన టేబుల్ 1872లో బొంబాయి ప్రెసిడెన్సీలో నిర్వహించిన జనాభా లెక్కల నుండి సేకరించారు. ఐతే ఈ సెన్సస్‌లో బ్రాహ్మణులను హిందువుల కిందే లెక్కించారు.  బ్రాహ్మణులు హిందువుల్లో భాగం కాదన్న వాదనేది ఇందులో లేదు. పోస్టులో షేర్ చేసిన టేబుల్‌లో కేవలం హిందువులలోని వివిధ కులాల జనాభా మాత్రమే కాకుండా బొంబాయిలో ఉంటున్న వివిధ మతాలు మరియు జాతుల జనాభాను కూడా పేర్కొన్నారు.

ఐతే అప్పట్లో జనాభా లెక్కల్లో హిందువులలో బ్రాహ్మణులును మినహాయిస్తే మిగిలిన అన్నీ హిందూ కులాలను ఒక్క వర్గం కింద, అలాగే హిందువుల నుండి వెలివేయబడిన కులాలను మరో వర్గం కింద లెక్కించారు. హిందువులైన లింగాయత్‌లోను కూడా విడిగా లిస్ట్  చేసారు. ఇదే విషయం వైరల్ పోస్టులో షేర్ చేసిన టేబుల్‌లో కూడా చూడొచ్చు.

1872 సెన్సస్‌ డాక్యుమెంట్‌లో అప్పట్లో ఉన్న మతాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ క్రమంలోనే హిందూ మతానికి సంబంధించి వేద యుగంలో ఏయే వర్గాలు ఉండేవో, ఆ తర్వాత బ్రాహ్మణత్వం రూపుదిద్దుకున్న విధానం, అది అంతరించిన తరవాత కుల వ్యవస్థ ఎలా రుపొందిందో వివరించారు. ఈ వివరణలో వేదం యుగం నుండి ప్రస్తతం ఆచరణలో ఉన్న కుల వ్యవస్థలో కూడా బ్రాహ్మణులను హిందువులగానే పేర్కొన్నారు.

వేదం యుగం అనంతరం బ్రాహ్మణత్వం రూపుదిద్దుకుంటున్న సమయంలో (కుల వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకోక ముందు) బ్రాహ్మణులకు శివుడిని, క్షత్రియులకి విష్ణువుని, బ్రాహ్మను వైష్ణవులకు మరియు శూద్రులకు గణేశుడిని ఆపాదించే వారని కూడా వీటిలో పేర్కొన్నారు. అప్పట్లో హిందువులను ఈ నాలుగు వర్గాలలో కూడా లెక్కించేవారు.

19వ శతాబ్దంలో నిర్వహించిన జనాభా లెక్కల్లో బ్రాహ్మణులను హిందువుల కిందే పరిగణిస్తూ లెక్కించారు. ఉదాహారణకి   1871-72 బ్రిటీష్ ఇండియా వ్యాప్తంగా నిర్వహించిన జనాభా లెక్కల్లో కూడా బ్రాహ్మణులను హిందువులుగానే లెక్కించారు. అలాగే 1881 బొంబాయి ప్రెసిడెన్సీలో నిర్వహించిన ఇంపీరియల్ సెన్సస్ చుస్తే కూడా మను ఇదే అర్ధమవుతుంది.

ఈ లెక్కలల్లో కూడా బ్రాహ్మణులను మరియు ఇతర కులాలను వేరువేరుగా వర్గించడాన్ని చూడొచ్చు. ఐతే ఇలా బ్రాహ్మణులను మరియు ఇతర కులాలను వేరువేరుగా వర్గించడాన్ని తప్పుగా అర్ధం చేసుకొని బ్రాహ్మణులు హిందువులలో భాగం కాదన్న వాదన చేసి ఉండవచ్చు.

చివరగా, 19వ శతాబ్దంలో బ్రాహ్మణులను హిందువులలో భాగంగా పరిగణించేవారు కాదన్న వాదన తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll