Fake News, Telugu
 

జూలై 2025లో జౌన్‌పూర్-రాయ్ బరేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన నిందితులు ముస్లింలు కాదు

0

ఉత్తరప్రదేశ్‌లో ఒక రైలుపై రాళ్లు రువ్విన ముస్లింలను జౌన్‌పూర్ పోలీసులు అరెస్టు చేసి, ఊరేగింపు చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నట్లు పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ఒక రైలుపై రాళ్లు రువ్విన ముస్లింలను జౌన్‌పూర్ పోలీసులు అరెస్టు చేసి, ఊరేగింపు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో జూలై 2025లో జౌన్‌పూర్-రాయ్‌బరేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంతమంది యువకులు రాళ్లు రువ్విన సంఘటనకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్టయిన వారిలో ముస్లింలు లేరు. ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని, నిందితులందరూ హిందువులని జౌన్‌పూర్ జిల్లాలోని బర్సాతి పోలీస్ స్టేషన్ SHO Factlyతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ జూలై 2025లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, జూలై 2025లో, జౌన్‌పూర్-రాయ్‌బరేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు బర్సతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్వర్ హాల్ట్ దగ్గర చైన్ లాగడం వల్ల ఆగిపోగా, కొంతమంది యువకులు రైలుపై రాళ్లు రువ్వారు. 2025 మే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపు సందర్భంగా రోహిత్ యాదవ్, సౌరభ్ యాదవ్ అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారితీసిందని ఈ కథనాలు పేర్కొన్నాయి. మేలో జరిగిన గొడవలో పాల్గొన్న పలువురిని రైలులో గుర్తించిన రోహిత్ స్నేహితులు, వారి స్నేహితులకు సమాచారం ఇచ్చి, వారిపై దాడి చేయడానికి చైన్ లాగి రైలును ఆపారు, రైలును ఆపడంపై కొందరు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేయగా, రోహిత్, అతని స్నేహితులు ఇతర ప్రయాణికులతో పాటు రైలుపై కూడా రాళ్లతో దాడి చేశారని ఈ కథనాలు పేర్కొన్నాయి.

12 జూలై 2025న ప్రచురితమైన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం, ఈ కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు, అరెస్టయిన వారి పేర్లు: రోహిత్ యాదవ్, శశికాంత్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆశు యాదవ్, సాగర్ బింద్, శుభమ్ మౌర్య, కృష్ణ యాదవ్, సంకేత్ పాల్, ప్రిన్స్ బింద్, పవన్ యాదవ్, అరెస్టయిన వారందరూ జౌన్‌పూర్ జిల్లాకు చెందినవారేనని ఈ కథనం పేర్కొంది.

తదుపరి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం జౌన్‌పూర్ జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను పరిశీలించగా, ఈ కేసులో మొత్తం పది మందిని నిందితులగా చేర్చినట్టు తెలిసింది. వారి పేర్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొన్న పేర్లతో సరిపోలాయి. ఈ కేసు సంబంధించి నమోదైన FIR కాపీను ఇక్కడ చూడవచ్చు. 

ఈ కేసులో మతపరమైన కోణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు, మేము జౌన్‌పూర్ జిల్లాలోని బర్సాతి పోలీస్ స్టేషన్ SHO ని సంప్రదించాము, Factlyతో మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారని ఆయన పేర్కొన్నారు.

చివరిగా, జూలై 2025లో జౌన్‌పూర్-రాయ్‌బరేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంతమంది యువకులు రాళ్లు రువ్విన సంఘటను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll