ABN ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉచితంగా రూ.100 కోట్లు విలువైన 25 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొంటూ ‘ABN ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించినట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) విస్తృతంగా షేర్ అవుతోంది . ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ABN ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.100 కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది- ఆంధ్రజ్యోతి వార్త కథనం.
ఫాక్ట్(నిజం): ABN ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.100 కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది అని ఆంధ్రజ్యోతి ఈ వార్త ప్రచురించలేదు. వైరల్ న్యూస్ పేపర్ క్లిప్ ఫేక్ అని 07 జనవరి 2026న ABN ఆంధ్రజ్యోతి ఫ్యాక్ట్‌చెక్ కథనం ద్వారా ప్రకటించబడింది. 06 జనవరి 2026 రోజటి పత్రికలో ఈ వార్త లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.100 కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని ABN ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం ఉచితంగా కేటాయించిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.
వైరల్ అయిన న్యూస్‌పేపర్ క్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలించగా, అందులో 06 జనవరి 2026 తేదీతో పాటు పేజీ నంబర్ 01 వాటర్‌మార్క్ ఉన్నట్లు మేము గమనించాము. అంటే, ఈ న్యూస్ పేపర్ క్లిప్ ఆ తేదీన ‘ఆంధ్ర జ్యోతి’ పత్రికలో ప్రచురితమైందని తెలుస్తోంది. దీన్ని నిర్ధారించేందుకు మేము 06 జనవరి 2026 నాటి ‘ఆంధ్ర జ్యోతి’ న్యూస్ పేపర్ యొక్క డిజిటల్ కాపీని (ఆర్కైవ్డ్ లింక్) తనిఖీ చేసాము. అయితే, ఈ రకమైన కథనం వార్తాపత్రికలో ఎక్కడా కనిపించలేదు. మొదటి పేజీలోనే కాదు, పత్రిక మొత్తంలో ఎక్కడా ఇటువంటి వార్త లేదు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పేపర్ క్లిప్ ఎడిట్ చేయబడిందని స్పష్టమవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి, ABN ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫోటో గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ABN ఆంధ్రజ్యోతి 01 జనవరి 2026న ప్రచురించిన కథనం ఒకటి మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ ఫోటో నూతన సంవత్సర వేడుకల నాడు తీసినది, ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి వేమూరి రాధాకృష్ణను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని కూడా తేలింది.

07 జనవరి 2026న, ABN ఆంధ్రజ్యోతి ఒక ఫ్యాక్ట్‌చెక్ కథనం ప్రచురించింది. అదే రోజు, తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్-చెకింగ్ విభాగం కూడా Xలో (ఆర్కైవ్డ్ లింక్) వైరల్ అయిన న్యూస్ పేపర్ క్లిప్ నకిలీదని పేర్కొంటూ పోస్ట్ చేసింది.

చివరిగా, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ABN ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా 25 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్త ప్రచురించలేదు.

