Fake News, Telugu
 

ఫోటోలో ఉన్న 14వ శతాబ్దం నాటి అస్ట్రోలేబ్‌ పరికరం భారత్ కి సంబంధించింది కాదు

0

14వ శతాబ్దం నాటి అస్ట్రోలేబ్‌ పరికరం ఇది. గ్రహాలు, నక్షత్రాల దూరాన్ని కొలిచేందుకు వినియోగించే విలువైన సాధనమిది. భారత్‌ నుంచి బ్రిటన్‌కు తరలించుకెళ్లిన అమూల్యమైన సంపదలో ఇదీ ఒకటి. అక్కడి సోతబీస్‌ ప్రదర్శనశాలలో ఈనెల 31న వేలం వేయనున్నారు. సుమారు 8 లక్షల పౌండ్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు’, అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత్‌ నుంచి బ్రిటన్‌కు తరలించుకెళ్లిన 14వ శతాబ్దం నాటి అస్ట్రోలేబ్‌ పరికరం ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో ఉన్న 14వ శతాబ్దం నాటి అస్ట్రోలేబ్‌ పరికరం భారత్ కి సంబంధించింది కాదు. అది స్పెయిన్ దేశానికి చెందింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి వెతకగా, అదే విషయాన్ని చెప్తూ 30 మార్చి 2021న ‘ఈనాడు’ వార్త పత్రిక కూడా పోస్ట్ లోని ఫోటోని ప్రచురించినట్టు (ఆర్కైవ్డ్) తెలిసింది. అయితే, నిజంగానే అస్ట్రోలేబ్‌ పరికరం భారత్ కి సంబంధించిందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోని డొమినిక్ లిపిన్సకి అనే వ్యక్తి 29 మార్చి 2021 న తీసినట్టు ‘పీఏ ఇమేజెస్’ అనే వెబ్సైటులో చూడవొచ్చు. ఆ ఫోటో వివరణలో ఎక్కడా కూడా ఫోటోలోని పరికరం భారత్ కి చెందిందని రాసి లేదు. సోతబీస్‌ సంస్థ 31 మార్చి 2021 న దాన్ని వేలం వేయనున్నట్టు మాత్రం రాసి ఉంది.

సోతబీస్‌ సంస్థ వారి వెబ్సైటులో ఫోటోలోని అస్ట్రోలేబ్‌ పరికరం గురించి వెతకగా, అది స్పెయిన్ దేశానికి చెందినట్టు తెలిసింది. అంతేకాదు, ఆ పరికరం పై అబ్జాద్ సంఖ్యలతో కుఫిక్ స్క్రిప్ట్ ఉందని తెలిసింది. పరికరం పై యెమెన్ ప్రాంతపు ప్రభావం కూడా కనిపిస్తుందని వెబ్సైటు లో రాసి ఉంది. ఆ పరికరం కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చదవొచ్చు. అయితే, ఎక్కడా కూడా ఫోటోలోని పరికరం భారత్ కి చెందినట్టు రాసి లేదు.

ఫోటోలోని అస్ట్రోలేబ్‌ పరికరం గురించి సోతబీస్‌ సంస్థ వారి యూట్యూబ్ మరియు ట్విట్టర్ అకౌంట్లలో కూడ చూడవొచ్చు.

31 మార్చి 2021 న వేలానికి వచ్చిన మరో అస్ట్రోలేబ్‌ కూడా భారత్ కి చెందింది కాదు. సోతబీస్‌ సంస్థ వారి వెబ్సైటులో భారత్ కి చెందిన అస్ట్రోలేబ్‌ పరికరాలు కూడా ఉన్నాయి. అయితే, అవి చాలా వరకు ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘలుల కాలానికి చెందినవని రాసి ఉన్నట్టు గమనించవొచ్చు. పోస్ట్ లోని ఫోటోలోనిది మాత్రం భారత్ కి చెందింది కాదు.

భారత్ కి చెందిన అస్ట్రోలేబ్‌ పరికరాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఫోటోలో ఉన్న 14వ శతాబ్దం నాటి అస్ట్రోలేబ్‌ పరికరం భారత్ కి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll