Fake News, Telugu
 

తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని పేర్కొనలేదు, కేవలం ఒక చాక్లెట్ శాంపిల్ గురించి మాత్రమే తెలిపింది

0

క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ సూచించింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ ఫుడ్ ఎనాలిసిస్  రిపోర్ట్ ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ రిపోర్ట్ ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. రాబిన్ జాకీస్ అనే వ్యక్తి తను కొనగోలు చేసిన రెండు చాక్లెట్లను తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీకి పరీక్షల కోసం పంపగా, 27 ఫిబ్రవరి 2024న తమ రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్‌ ‘తినడానికి సురక్షితం కాదని’ ల్యాబ్‌లో గుర్తించబడిందని, ఎందుకంటే అందులో ‘తెల్ల పురుగులు’ కనిపించాయి అని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ తమ రిపోర్టులో పేర్కొంది. అలాగే రెండోవ నమూనా అయిన ఫ్రూట్ & నట్ చాక్లెట్ ‘ తినడానికి అసురక్షితం కాదు (తినడానికి సురక్షితం)’ అని రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు, తమ నివేదిక కేవలం పరీక్షలకు సమర్పించిన నమూనాలకే పరిమితమైందని తమ రిపోర్టులో పేర్కొంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

హైదరాబాద్ నగరానికి చెందిన రాబిన్‌ విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి 09 ఫిబ్రవరి 2024న క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లను అమీర్‌పేట్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసి, తెరిచి చూడగా, అందులో పురుగులు కనిపించాయి. దీంతో రాబిన్‌ విజయ్‌కుమార్‌ జాకీస్ ఈ విషయాన్ని వెంటనే బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. అంతేకాకుండా, చాక్లెట్‌లో పురుగులు పాకుతున్న దృశ్యాన్ని వీడియో తీసి డైరీమిల్క్ ఇండియాను ట్యాగ్ చేస్తూ తన X(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. “అమీర్‌పేట్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగులు ఉండటాన్ని గమనించాను. త్వరలో గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు” అని రాబిన్ తన X అకౌంట్‌లో ప్రశ్నించాడు.

తదనంతరం, రాబిన్ జాకీస్ తాను కొనగోలు చేసిన చాక్లెట్లను తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీకి పరీక్షల కోసం పంపగా, వాటిని పరీక్షించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ 27 ఫిబ్రవరి 2024న తమ రిపోర్టులను రాబిన్ కు పంపింది. ఈ రిపోర్టులను రాబిన్ తన X(ట్విట్టర్)లో 28 ఫిబ్రవరి 2024న పోస్ట్ చేశాడు. అలాగే తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ తాను పంపిన క్యాడ్‌బరీ చాక్లెట్( రోస్టెడ్ ఆల్మండ్) తినడానికి సురక్షితం కాదని ధృవీకరించింది అని పోస్టులో తెలిపాడు. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ట్యాగ్ చేశాడు.

ఇదే విషయమై క్యాడ్‌బరీ  డైరీమిల్క్ ఇండియాను (మోండెలెజ్ ఇండియా)స్పందిస్తూ “కంపెనీ అంతర్జాతీయంగా ఆమోదించబడిన HACCP (హాజర్డ్ అనాలిసిస్ & క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్) ప్రోగ్రామ్‌ను అనుసరిస్తుందని. ఇది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన ఆహార భద్రతా వ్యవస్థకు సంబంధించిన‌ది, మా ఉత్పత్తులు భౌతిక, రసాయన, సూక్ష్మజీవ సంబంధిత సమస్యల నుండి రక్షణ పొందేలా మా చర్యలు ఉంటాయి.ఇతర ఆహార ఉత్పత్తుల మాదిరిగానే చాక్లెట్‌ల సరఫరాలో, రిటైల్ గా అమ్మే సమయాల్లో, నిల్వ చేసే సమయంలోనూ నిర్దిష్ట శ్రద్ధ చాలా అవసరం.అదే బ్యాచ్ మరియు అదే సమయంలో తయారు చేయబడిన ఇతర బ్యాచ్‌ల నమూనాలపై పరీక్షలు నిర్వహించబడ్డాయి, వాటిలో ఎటువంటి సమస్యలు కనిపించలేదు. తయారీ ప్రక్రియ సమయంలో ఉత్పత్తి ప్రభావితం కాలేదనిమేము విశ్వసిస్తున్నాము.” అని సమాధానం ఇచ్చింది.

ఈ రిపోర్టులను పరిశీలించగా, అతను పరీక్షల నిమిత్తం పంపిన రెండు డైరీ మిల్క్ చాక్లెట్‌లలో రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్‌ ‘తినడానికి సురక్షితం కాదని’ ల్యాబ్‌లో గుర్తించబడిందని, ఎందుకంటే అందులో ‘తెల్ల పురుగులు’ కనిపించాయి అని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ తమ రిపోర్టులో పేర్కొంది. అలాగే రెండవ నమూనా అయిన ఫ్రూట్ & నట్ చాక్లెట్ ‘అసురక్షితం కాదు (తినడానికి సురక్షితం)’ అని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు తమ నివేదిక కేవలం పరీక్షలకు సమర్పించిన నమూనాలకే పరిమితమైందని తమ రిపోర్టులో పేర్కొంది. దీన్ని బట్టి తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ  క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని తమ రిపోర్టులో పేర్కొనలేదని, కేవలం ఆ నమూనా చాక్లెట్‌లలో ఒక చాక్లెట్‌ తినడం సురక్షితం కాదని అని చెప్పినట్లు నిర్థారించవచ్చు. ఇదే అంశంపై పలు వార్త సంస్థల కథనాలు ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు.

చివరగా, తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్లు తినడం సురక్షితం కాదని తమ రిపోర్టులో పేర్కొనలేదు, కేవలం ఆ చాక్లెట్ నమూనా (శాంపిల్) గురించి మాత్రమే తెలిపింది.

Share.

About Author

Comments are closed.

scroll