Fake News, Telugu
 

టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

0

“టాటా మోటార్స్ సాధారణ వినియోగదారుల కోసం కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసింది, భారత వాహన మార్కెట్‌లో టాటా మోటార్స్ మరోసారి కొత్త చరిత్ర సృష్టించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ప్రముఖ తెలుగు మీడియా సంస్థ HMTV కూడా ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ కథనం ప్రచురించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసింది.

ఫాక్ట్(నిజం): టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేయలేదు. టాటా మోటార్స్ మార్కెట్లోకి ఏ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టాటా మోటార్స్ తాము ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం లేదని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే ఏదైనా 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, టాటా మోటార్స్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసినట్లు విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు. ఒకవేళ టాటా మోటార్స్ కొత్తగా ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి.

తదుపరి, మేము టాటా మోటార్స్ కు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడఇక్కడఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ), వెబ్‌సైట్‌ను పరిశీలించాము, అక్కడ కూడా, టాటా మోటార్స్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసిందని లేదా రాబోయే రోజుల్లో మార్కెట్లో ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెడుతుందని ఎటువంటి సమాచారం/ఆధారాలు లభించలేదు.

టాటా మోటార్స్ పలు పోస్టులపై స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది (ఇక్కడ, ఇక్కడ). అలాగే టాటా మోటార్స్ తాము ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం లేదని కూడా స్పష్టం చేసింది (ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే వైరల్ పోస్ట్‌లలో షేర్ చేయబడిన టాటా మోటార్‌సైకిళ్ల ఫోటోలు AI ద్వారా రూపొందించబడ్డాయి. గతంలో కూడా టాటా కంపెనీ ₹3,249 కు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసిందని, టాటా మోటార్స్ 624cc ఇంజిన్ & 30 కి.మీ మైలేజీతో కొత్త నానో కారును విడుదల చేయబోతోందని పేర్కొంటూ పలు పోస్ట్‌లు వైరల్ కాగా, అందులో నిజం లేదని చెప్తూ Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. టాటా మోటార్స్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం లేదని స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll