Fake News, Telugu
 

స్వామి విద్యానంద్ విదేహ్ నెహ్రూని చెంపదెబ్బ కొట్టలేదు, ఈ ఫోటో 1962 పాట్నా బహిరంగ సభలో తీసింది

0

వివరణ (06 June 2022):
1962 చైనా-భారత్ యుద్ధం తరువాత అజ్మీర్లో జరిగిన ఒక బహిరంగ సభలో నెహ్రూ ఆర్యులు భారతదేశంలో శరణార్ధులు మాత్రమే అని వ్యాఖ్యానించడంతో, స్వామి విద్యానంద్ విదేహ్, నెహ్రూని చెంపదెబ్బ కొట్టినట్టు ఒక పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. “ఆర్యులు శరణార్థులు కాదు. మా పూర్వీకులు భారతదేశం యొక్క అసలు వారసులు, కానీ మీరు (నెహ్రూ పూర్వీకులు) అరేబియా సంతతికి చెందినవారు మరియు మీలో అరబ్ రక్తం ప్రవహిస్తుంది కాబట్టి మీరు నిజంగా ఈ గొప్ప దేశానికి అసలు వారసులు కాదు … మీకు బదులుగా సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయ్యుంటే భారత్ చైనా చేతిలో యుద్ధం ఓడిపోయి ఉండేది కాదు, మరియు టిబెట్ కూడా భారత దేశంలోనే ఉండేది.” అని స్వామి విద్యానంద్ విదేహ్ అన్నట్టు కూడా పోస్టులో చెప్తున్నారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలన్నీ ‘विदेह गाथा: एक आर्य संन्यासी की डायरी’ and ‘नेहरू : उत्थान और पतन’ అనే పుస్తకాలలో పేర్కొన్నట్టు కూడా పోస్టులో తెలిపారు. కానీ అసలు ఇటువంటి పుస్తకాలు ప్రచురించి ఉన్నట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం లభించలేదు. అలాగే, క్రింద వివరించినట్టు పోస్టులో పేర్కొన్న సంఘటన కూడా జరిగినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేవు.

స్వామి విద్యానంద్ విదేహ్ ఒక బహిరంగ సభలో జవహర్ లాల్ నెహ్రూని చెంపదెబ్బ కొట్టినప్పుడు తీసిన ఫోటో అని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. జవహర్ లాల్ నెహ్రూ ఒక బహిరంగ సభలో ఆర్యులు భారతదేశంలో శరణార్ధులు మాత్రమే అని వ్యాఖ్యానించడంతో, ఆ సభకి ముఖ్య అతిధిగా వచ్చిన విద్యానంద్ విదేహ్, వేదిక పైకి వెళ్లి నెహ్రూని చెంపదెబ్బ కొట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోటో గురుంచి వాస్తవాలు తెలుపమని ఇటీవల FACTLY వాట్సాప్ టిప్‌లైన్ (+91 9247052470) నెంబర్‌కి పలువురు యూసర్లు మెసేజ్ చేసారు. ఈ ఫోటోని ఇదే క్లెయింతో ఇంగ్లీష్ భాషలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటన 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత చోటుచేసుకున్నట్టు ఈ పోస్టులలో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్వామి విద్యానంద్ విదేహ్ బహిరంగ సభలో జవహర్ లాల్ నెహ్రూని చెంపదెబ్బ కొట్టినప్పుడు తీసిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో 1962లో పాట్నా నగరంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో తీసారు. ఈ బహిరంగ సభకు వచ్చిన ప్రజలు నెహ్రూని చూడటానికి స్టేజి పైకి దూసుకురావడంతో, ఆ జనాల నుండి రక్షణ కోసం ఒక సెక్యూరిటీ సిబ్బంది నెహ్రూని ఇలా పట్టుకున్నాడు. స్వామి విద్యానంద్ విదేహ్ నెహ్రూని బహిరంగంగా చెంపదెబ్బ కొట్టినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Outlook’ న్యూస్ సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 1962లో చైనా-భారత్ యుద్ధం ముందు నిర్వహించిన ఒక బహిరంగసభలో, జవహర్ లాల్ నెహ్రూ అల్లరిమూకల మధ్యకు రానివ్వకుండా తన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్న దృశ్యమంటూ ఈ ఫోటో వివరణలో తెలిపారు. ‘Outlook’ న్యూస్ సంస్థ ఈ ఫోటో క్రెడిట్  ‘Associate Press’ న్యూస్ సంస్థకు ఇచ్చింది.

ఈ ఫోటో ‘Associate Press’ న్యూస్ సంస్థ వెబ్సైటులో కూడా లభించింది. ఈ ఫోటో కాంగ్రెస్ పార్టీ 01 జనవరి 1962 నాడు పాట్నా నగరంలో నిర్వహించిన బహిరంగసభలో తీసినట్టు ఈ వెబ్సైటులో తెలిపారు. ఈ బహిరంగ సభకు హాజరైన ప్రజలు నెహ్రూని చూడటానికి స్టేజి దగ్గరికి దూసుకురావడంతో, ఆ అల్లరిమూకల మధ్యకు నెహ్రూని రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది నెహ్రూని పట్టుకున్నట్టు ఫోటో అని వివరణలో పేర్కొన్నారు. ఈ ఘర్షణ తరువాత చైనా-భారత్ యుద్ధం చోటుచేసుకున్నట్టు వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. 

ఈ ఘర్షణకు సంబంధించి ‘Indian Express’ 1962లో ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుకి సంబంధించి స్పష్టతనిస్తూ ‘The Times of India’ న్యూస్ సంస్థ తమ ఫేస్బుక్ పేజిలో వీడియోని పబ్లిష్ చేసింది.

స్వామి విద్యానంద్ విదేహ్ గురించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతకగా, స్వామి విద్యానంద్ విదేహ్ ‘Ved-Sansthan’ అనే సంస్థ వ్యవస్థాపకులు అని తెలిసింది. స్వామి విద్యానంద్ విదేహ్ వేదాలలో ప్రముఖు పండితుడని, యోగా జీవనశైలి భోదకుడని తెలిసింది. స్వామి విద్యానంద్ విదేహ్ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని బహిరంగ సభలో చెంపదెబ్బ కొట్టినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం గానీ, ఆధారాలు గానీ లేవు.

చివరగా, 1962 పాట్నా బహిరంగ సభలో తీసిన ఫోటోని స్వామి విద్యానంద్ విదేహ్ నెహ్రూని చెంపదెబ్బ కొట్టినప్పుడు తీసిన ఫోటోగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll