‘రోహింగ్యాలు, బంగ్లాదేశీలను నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని దేశం నుండి బయటకు గెంటండని’ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘రోహింగ్యాలు, బంగ్లాదేశీలను నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని దేశం నుండి బయటకు గెంటండి – సుప్రీమ్‌కోర్ట్’.
ఫాక్ట్ (నిజం): జమ్మూ ప్రాంతంలో అక్కడి ప్రభ్తుత్వం రోహింగ్యాలను డిటెన్షన్ సెంటర్లకు తరలించి, వీరిని తిరిగి వారి దేశానికి పంపించాలని నిర్ణయించింది. ఐతే, దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రోహింగ్యాలను తిరిగి పంపించే అంశానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేమని స్పష్టం చేసింది. కేవలం జమ్మూలో ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లకు తరలించిన రోహింగ్యాలను ఉద్దేశించింది మాత్రమే ఈ తీర్పులో సుప్రీం కోర్ట్ చెప్పింది. పైగా ఈ తీర్పులో, బంగ్లదేశీయుల గురించి కోర్టు ప్రస్తావించలేదు. అలాగే పోస్టులో చెప్తున్నట్టు ఈ భాషని కోర్ట్ వాడలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మార్చ్ 2021లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జమ్మూ ప్రాంతంలో సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఉంటున్న సుమారు 155 మంది మయాన్మార్ కి చెందిన రోహింగ్యాలను హోల్డింగ్ సెంటర్ అయిన హిరానగర్ జైలుకి తరలించింది. పైగా వీరిని తిరిగి తమ దేశానికి పంపించాలని నిర్ణయించింది. ఐతే వీరిని వదిలేయాలని సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
ఈ PILపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రోహింగ్యాలను డిటెన్షన్ సెంటర్లకు తరలించే విషయంలోగానీ, లేక వారిని తిరిగి వారి దేశానికి పంపించే విషయంలో గాని పిటిషనర్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వలేమని చెప్పింది. కాకపోతే పూర్తి ప్రొసీజర్ పాటించిన తర్వాతే వీరిని తిరిగి వారి దేశానికి పంపించాలని అభిప్రాయపడింది.
ఐతే, ఈ తీర్పు కేవలం జమ్మూలో ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లకు తరలించిన రోహింగ్యాలకు ఉద్దేశించింది మాత్రమే. పైగా ఈ తీర్పులో బంగ్లదేశీయుల గురించి కోర్టు ప్రస్తావించలేదు. అలాగే పోస్టులో చెప్తున్నట్టు ఇలాంటి భాషని వాడలేదు.
చివరగా, రోహింగ్యాలను మరియు బంగ్లాదేశీయులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.