Fake News, Telugu
 

జైపూర్‌లో కాల్చి చంపబడిన రాజ్‌పుత్ కర్ణీ సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవలేదు

0

2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఒక శాసనసభ్యుడిని ఇటీవల దుండగులు తుపాకితో కాల్చి చంపేసారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఈ విషయాన్ని ఏ ఒక్క మీడియా సంస్థ రిపోర్ట్ చేయలేదని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఈ వీడియోలోని వ్యక్తి 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధి, ఇతన్ని దుండగులు కాల్చి చంపారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో చనిపోయిన వ్యక్తి రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన ప్రెసిడెంట్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ. 05 డిసెంబర్ 2023 నాడు జైపూర్ నగరం శ్యామ్‌నగర్‌లోని తన నివాసంలో సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు గురయ్యారు. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యుడిగా గెలవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, వీడియోలోని అదే వ్యక్తి ఫోటోని షేర్ చేస్తూ 05 డిసెంబర్ 2023 నాడు పబ్లిష్ చేసిన ఒక వార్తా కథనం దొరికింది.  రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన ప్రెసిడెంట్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ జైపూర్ నగరం శ్యామ్‌నగర్‌లోని తన నివాసంలో హత్యకు గురయ్యారని ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేశారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘First India News’ న్యూస్ ఛానెల్ పబ్లిష్ చేసిన వీడియోలో పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు కలిగి ఉన్నాయి.

05 డిసెంబర్ 2023 నాడు జైపూర్ నగరం శ్యామ్‌నగర్‌లోని తన నివాసంలో హంతకులు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీపై కాల్పులు జరిపారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు సంబంధించి పబ్లిష్ చేసిన వార్తా కథానాలు మరియు వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.


అయితే, పోస్టులో తెలుపుతున్నట్టు 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో సుఖ్‌దేవ్ సింగ్ పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలవలేదు. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధుల జాబితాలో సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ పేరు లేదు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సుఖ్‌దేవ్ సింగ్ పెట్టిన చివరి ట్వీట్‌ను ఇక్కడ చూడవచ్చు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన శాసనసభ్యుడు ఇటీవల హత్యకు గురైనట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.   

చివరగా, జైపూర్‌లో కాల్చి చంపబడిన రాజ్‌పుత్ కర్ణీ సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవలేదు.

Share.

About Author

Comments are closed.

scroll