“ఎవరి సహాయం లేకుండా స్వయంగా నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ ఫార్మ్ నింపుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను,” అని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఇటీవల వ్యాఖ్యలు చేసినట్టు ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నరేంద్ర మోదీ తన ఎన్నికల ఫారం ఎవరి సహాయం లేకుండా నింపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఇటీవల వ్యాఖ్యానించారు.
ఫాక్ట్ (నిజం): ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సుబ్రమణియన్ స్వామి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అనేక ట్వీట్లు చేసారు. కానీ, నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ స్వయంగా నింపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ ప్రకటించలేదు. బీజేపీలోని చాలా మంది నాయకులు తనను నిత్యం కించపరుస్తూ పార్టీ నుండి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, కానీ తాను బీజేపీని విడిచి వెళ్ళే ప్రసక్తే ఉండదని సుబ్రమణియన్ స్వామి పలు ట్వీట్లలో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు నరేంద్ర మోదీ ఎన్నికల నామినేషన్ ఫార్మ్ స్వయంగా నింపుకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించరా అని వెతికితే, సుబ్రమణియన్ స్వామి అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎటువంటి ట్వీట్ లేదా ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టలేదని తెలిసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్లో ఎటువంటి వార్త కూడా పబ్లిష్ అవలేదు. ఒకవేళ ప్రధాని మోదీని ఉద్దేశించి సుబ్రమణియన్ స్వామి అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఖచ్చితంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలని, నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తూ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అనేక ట్వీట్లు పెట్టారు. అటువంటి కొన్ని ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ స్వయంగా నింపుకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని సుబ్రమణియన్ స్వామి ఎటువంటి ట్వీట్ పెట్టలేదు .
బీజేపీలోని చాలా మంది నాయకులు తనను నిత్యం కించపరుస్తూ పార్టీ నుండి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, కానీ తనకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లపై ఉన్న అభిమానంతో బీజేపీలో కొనసాగుతున్నానని సుబ్రమణియన్ స్వామి 2020 ఫిబ్రవరీ నెలలో ఒక ట్వీట్ పెట్టారు. “బీజేపీని విడిచి వెళ్ళే ప్రసక్తే ఉండదు, నన్ను బయటకి నెట్టబడాలి, అది దాదాపుగా అసాధ్యం. వ్యక్తులు కాదు, భావాజాలం ముఖ్యం. ”, అని సుబ్రమణియన్ స్వామి మరొక ట్వీట్లో తెలిపారు.
చివరగా, ప్రధాని మోదీ తన ఎన్నికల నామినేషన్ ఫార్మ్ స్వయంగా నింపుకుంటే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని సుబ్రమణియన్ స్వామి ప్రకటించలేదు.