Fake News, Telugu
 

2014 నుండి ఇప్పటివరకు ED రూ. 1,16,792 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది; జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.16,637.21 కోట్లు

0

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్స్ ద్వారా గత UPA ప్రభుత్వం తమ పది సంవత్సరాల కాలంలో రూ. 4,156 కోట్ల నల్లధనం మాత్రమే వెలికి తీసారని, కాని ప్రస్తుత NDA ప్రభుత్వ హయంలో ఇప్పటివరకు రూ. 1,22,731 కోట్ల నల్లధనం వెలికి తీసారని అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్స్ ద్వారా గత UPA ప్రభుత్వం తమ పది సంవత్సరల కాలంలో రూ. 4,156 కోట్ల నల్లధనం మాత్రమే వెలికితీస్తే, NDA ప్రభుత్వం 2014 నుండి ఇప్పటివరకు రూ. 1,22,731 కోట్ల నల్లధనం వెలికి తీసింది.

ఫాక్ట్ (నిజం): రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2004-05 నుండి  2013-14 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 5346.16 కోట్లు, మరియు 2014 నుండి అక్టోబర్ 2023 వరకు ED రూ. 1,16,792 కోట్ల  ఆస్తులను అటాచ్ చేసింది. కాకపోతే, అటాచ్ చేసిన ఆస్తులన్ని నల్లధనం కాదు. కేవలం కోర్టులో విచారణ ముగిసే వరకే ED ఆధీనంలో ఉంటాయి. కోర్టులో విచారణ ముగిశాక, మనీలాండరింగ్ నేరం జరిగిందని కోర్టు గుర్తిస్తే, ఆ ఆస్తిని జప్తు చేయాలని ఆదేశిస్తుంది. అలా 2014 నుండి అక్టోబర్ 2023 వరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ 16,637.21 కోట్లు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల రాజ్యసభలో జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధనంగా పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు మరియు ప్రధాన మంత్రి కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ ఇలా చెప్పారు ‘2014 నుండి అక్టోబర్ 2023 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA చట్టం క్రింద తాత్కాలికంగా అటాచ్ చేసిన నేరల ఆస్తుల మొత్తం విలువ రూ. 1,16,792 కోట్లు మరియు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ 16,637.21 కోట్లు.’

ఆస్తులను అటాచ్మెంట్ అనగా ఏమిటి: వాస్తవానికి ED మొదట ఆస్తులకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సేకరిస్తుంది. సాక్ష్యం పొందిన తర్వాత ఆ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. దీని తర్వాత ఈడీ కేసుకు సంబంధించి కోర్టులో సాక్ష్యాలను సమర్పించి ఆస్తిని ఎందుకు అటాచ్ చేసిందో వివరించాలి. కోర్టులో తీర్పు ఈడీకి అనుకూలంగా వస్తే, అటాచ్ చేసిన ఆస్తిని స్వాధీనం చేసుకుని అటాచ్ చేస్తారు. ఎప్పుడయినా ఈడీ ఎవరి సొత్తును అటాచ్ చేసినా దాన్ని సీలింగ్ చేయడం కాదు. ఈ ఆస్తి యొక్క ఉపయోగం కొనసాగుతుంది. అంటే, ఒకరి ఇల్లు అటాచ్ చేయబడితే ప్రజలు అందులో నివసించవచ్చు. అంతే కాకుండా దానిని అద్దెకు కూడా ఇవ్వవచ్చు. కార్యాలయాలు, కర్మాగారాలు మొదలైన వాటితో కూడా అదే జరుగుతుంది. అయితే, అటాచ్ చేసిన తర్వాత, ఈ ఆస్తిని విక్రయించలేరు లేదా మరొకరి పేరుకు బదిలీ చేయలేరు. ఆస్తి వినియోగం కోర్టు నిర్ణయం వరకు కొనసాగుతుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ED ఈ చర్యలన్నింటినీ తీసుకుంటుంది. నిందితుడు ఆస్తిని అటాచ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టులో విచారణ ముగిశాక, మనీలాండరింగ్ నేరం జరిగిందని కోర్టు గుర్తిస్తే, ఆ ఆస్తిని జప్తు చేయాలని ఆదేశిస్తుంది. అయితే, మనీలాండరింగ్ నేరం జరగలేదని కోర్టు గుర్తిస్తే లేదా అటాచ్ చేసిన ఆస్తి ఆ నేరంలో ప్రమేయం లేదని కోర్టు గుర్తిస్తే, ఆ ఆస్తిని అర్హులైన వ్యక్తికి విడుదల చేయాలని కోర్టు ఆదేశిస్తుంది.

ఉదాహరణకు 7 సెప్టెంబర్ 2022న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ vs డిప్యూటీ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందాతో కూడిన తెలంగాణ హైకోర్టు బెంచ్ ED డిప్యూటీ డైరెక్టర్ అటాచ్ చేసిన రూ. 23.23 కోట్లు విలువ చేసే  561.1996 ఎకరాల భూమిని విడుదల చేసింది.

దీన్ని బట్టి అటాచ్ చేసిన ఆస్తులన్ని నల్లధనం కాదని చెప్పొచ్చు. 2014 నుండి అక్టోబర్ 2023 వరకు వరకు ED అటాచ్ చేసిన రూ. 1,16,792 కోట్లు అంతా నల్లధనం కాదు. కేవలం కోర్టులో విచారణ ముగిసే వరకే ED ఆధీనంలో ఉంటాయి. కోర్టులో విచారణ ముగిశాక, మనీలాండరింగ్ నేరం జరిగిందని కోర్టు గుర్తిస్తే, ఆ ఆస్తిని జప్తు చేయాలని ఆదేశిస్తుంది. అలా 2014 నుండి అక్టోబర్ 2023 వరకు వరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ 16,637.21 కోట్లు.

అలాగే 26 జూలై 2022 లో రాజ్యసభలో జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధనంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రయిన పంకజ్ చౌదరి ఇలా చెప్పారు– ఆర్థిక సంవత్సరం 2004-05 నుండి ఆర్థిక సంవత్సరం 2013-14 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ PMLA చట్టం క్రింద తక్కువ సంఖ్యలో శోధనలు (112) జరిగాయి, దీని ఫలితంగా తాత్కాలికంగా అటాచ్ చేసిన నేరల ఆస్తుల మొత్తం విలువ రూ. 5346.16 కోట్లు అని మరియు ఈ కాలంలో, ట్రయల్ కోర్టులో ఎవరు దోషులుగా నిర్ధారించబడలేదు మరియు ఎటువంటి ఆస్తుల జప్తు జరగలేదు.

చివరగా, ప్రస్తుత NDA ప్రభుత్వ హయాంలో ED రూ. 1,16,792 కోట్ల ఆస్తులను అటాచ్ మాత్రమే చేసింది. విచారణ ఆన౦తరం జప్తు చేసిన ఆస్తుల విలువ రూ 16,637.21 కోట్లు.

Share.

About Author

Comments are closed.

scroll