నెల్లూరు మైపాడు వద్ద జాలరుల వలలో ఒడ్డుకు వచ్చిన జలకన్య, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వలలో చిక్కిన జలకన్యను కొందరు వ్యక్తులు విడిపిస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నెల్లూరు మైపాడు వద్ద వలలో చిక్కుకున్న ఒక జలకన్య ఒడ్డుకు వచ్చిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ‘Scream of the Mermaid’ అనే ఒక షార్ట్ ఫిల్మ్‌లోని దృశ్యాలని చూపిస్తుంది. ఈ చిత్రాన్ని ‘Trip Pisso’ అనే శ్రీలంక ట్రావెల్ వ్లాగర్ ఛానల్ వారు రూపొందించారు. సముద్ర కాలుష్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 08 జూన్ 2021 నాడు ‘ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం’ సందర్భంగా ఈ వీడియోని పబ్లిష్ చేసారు. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజంగా చోటుచేసుకున్న ఘటన కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Trip Pisso’ అనే శ్రీలంక ట్రావెల్ వ్లాగర్ ఛానల్ 07 జూన్ 2021 నాడు తమ యూట్యుబ్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘Real Mermaid caught in Sri Lanka | TRIP PISSO’ అనే టైటిల్‌తో ఈ వీడియోని పబ్లిష్ చేసారు. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక షార్ట్ ఫిల్మ్‌లోని దృశ్యాలని ఈ వీడియో వివరణ ద్వారా తెలిసింది. 08 జూన్ 2021 నాడు ‘ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం’ సందర్భంగా సముద్రాలలో పెరుగుతున్న కాలుష్యం, చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని రూపొందించినట్టు తెలిసింది.

ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీడియోని ‘Behind Pisso’ యూట్యూబ్ ఛానల్ 25 జూన్ 2021 నాడు పబ్లిష్ చేసింది. ‘Scream of the Mermaid’ అనే షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ దృశ్యాలని ఈ వీడియోలో స్పష్టంగా తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో, సాగర కన్యగా నటించిన అమ్మాయి, ఇతరులు షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం మేకప్ చేసుకుంటున్న దృశ్యాలని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇదే వీడియోని ‘Trip Pisso’ ఫేస్ బుక్ పేజీలో కూడా పబ్లిష్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో, ‘Scream of the Mermaid’ అనే షార్ట్ ఫిల్మ్‌లోని దృశ్యాలని చూపిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ‘Scream of the Mermaid’ అనే షార్ట్ ఫిల్మ్‌లోని దృశ్యాలని నెల్లూరు మైపాడు వద్ద జలకన్య ఒడ్డుకు చేరిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.