Fake News, Telugu
 

అమిత్ షా ప్రారంభించిన శారదా దేవి ఆలయం భారత భూభాగంలోనే ఉంది, PoKలో కాదు

0

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి (PoK) భారత్ అధికారికంగా ప్రవేశించిందని చెప్తున్న వీడియో ఒకటి విస్తృతంగా షేర్ అవుతోంది. యూట్యూబ్‌లో ఈ వీడియోను అప్లోడ్ చేసిన 14 గంటల్లోనే 90,000 పైగా చూసారు. PoKలోని శారదా దేవి శక్తి పీఠాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించడం ద్వారా భారత్ అధికారికంగా PoKలోకి అడుగుపెట్టిందని ఈ వీడియోలో చెపుతున్నారు. పైగా PoKలోని ప్రభుత్వ అనుమతితోనే (PoK అసెంబ్లీ తీర్మానం పాస్ చేయడం వల్ల) భారత ప్రభుత్వం ఈ శారదా ఆలయాన్ని ప్రారంభించిందని కూడా వీడియోలో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్న విషయాలలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి (PoK) భారత్ అధికారికంగా ప్రవేశించింది; PoKలోని శారదా దేవి శక్తి పీఠాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు.

ఫాక్ట్(నిజం): ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించింది PoKలోని శారదా శక్తి పీఠాన్ని కాదు, LoCకి ఇటు వైపు భారత భూభాగంలోని టీట్వాల్ గ్రామంలో ఉన్న శారదా దేవి ఆలయాన్ని. ఐతే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ PoKలోని శారదా పీఠం తీర్థయాత్రను పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఈ వార్తను తప్పుగా అర్ధం చేసుకొని భారత్ PoKలోకి అడుగుపెట్టిందని ప్రచారం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అమిత్ షా ప్రారంభించిన గుడి భారత భూభాగంలోనే ఉంది:

ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించింది శారదా శక్తి పీఠాన్ని కాదు, శారదా దేవి ఆలయాన్ని. పైగా ఈ ఆలయం ఉన్నది భారత భూభాగంలోనే, PoKలో కాదు.

కేంద్ర మంత్రి అమిత్ షా 22 మార్చ్ 2023న జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా ప్రాంతంలో ఉన్న శారదా దేవి ఆలయాన్ని ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఐతే ఈ ఆలయం నియంత్రణ రేఖ (LoC) దగ్గర, భారత భూభాగంలో ఉన్న టీట్వాల్ అనే ఊరులో ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణం 2021లో మొదలుపెట్టారు.

కాగా వైరల్ వీడియోలో ప్రస్తావించిన శారదా శక్తి పీఠం PoKలోని నీలం లోయలో ఉంది. కేంద్ర మంత్రి ప్రారంభించిన గుడికి మరియు PoKలో ఉన్న శారదా శక్తి పీఠానికి మధ్య 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

శారదా పీఠం తీర్థయాత్రను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాం:

కుప్వారాలోని శారదా దేవి ఆలయాన్ని ప్రారంభించిన సందర్భంలో అమిత్ షా మాట్లాడుతూ, PoKలోని శారదా పీఠం తీర్థయాత్రను పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఇంతకు ముందు భారత్ – పాక్ మధ్య పునఃప్రారంభించిన కర్తార్‌పూర్ కారిడార్ (పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ – పంజాబ్‌లోని డేరా బాబా నానక్ మందిరం) తరహాలోనే ఈ తీర్థయాత్రను ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

ఐతే ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని కేంద్ర మంత్రి PoKలోని శక్తి పీఠాన్ని ప్రారంభించాడని ప్రచారం చేస్తున్నారు.

PoK అసెంబ్లీ తీర్మానం:

కర్తార్‌పూర్ కారిడార్ తరహాలోనే భారత్- PoK మధ్య (శారదా పీఠం తీర్థయాత్ర) కారిడార్ ప్రారంభించాలని కోరుతూ PoK అసెంబ్లీ  ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించిందని. ఐతే ఈ అంశంపై PoK ప్రధాని సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఖాన్ విచారణకు ఆదేశించాడని తెలుపుతూ పాకిస్థాన్‌కు చెందిన ఎక్ష్ప్రెస్స్ ట్రిబ్యూన్ అనే వార్తా సంస్థ ఒక కథనాన్ని (04 ఏప్రిల్ 2023) ప్రచురించింది.

బహుశా ఈ వార్తను తప్పుగా అర్ధం చేసుకొని, PoK అసెంబ్లీ తీర్మానం ద్వారానే అమిత్ షా శారదా దేవి ఆలయాన్ని ప్రారంభించారన్న వాదన చేసి ఉంటారు. కాని అమిత్ షా ప్రారంభించిన శారదా దేవి ఆలయం భారత భూభాగంలో ఉంది.

చివరగా, అమిత్ షా ప్రారంభించిన శారదా దేవి ఆలయం భారత భూభాగంలోనే ఉంది, PoKలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll