ముస్లింలు హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకొని వారిని తీసుకొని పారిపోతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ చేస్తూ వీడియో తీసిన ముస్లింలంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందూ అమ్మాయి ముస్లిం ప్రియుడితో పారిపోతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రేమ జంటలు పారిపోవాలనుకుంటే అందుకోసం స్నేహితుల చేసే సహాయాన్ని చూపించేందుకు కొందరు బంగ్లాదేశ్‌కి చెందిన యువకులు ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో నటించిన అమ్మాయి కూడా ముస్లిం మతానికి చెందిన మహిళే అని తెలిసింది. ఈ వీడియో భారత దేశానికి చెందినది కాదు మరియు ఇందులో లవ్ జిహాద్ కొణమేమి లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక ఫేస్‌బుక్ యూసర్ 2023 మే నెలలో పోస్ట్ చేశారు. ప్రేమ వివాహం కోసం ముస్లిం మహిళను తీసుకెళ్తున్న దృశ్యాలంటూ ఈ వీడియోలో తెలిపారు. ఇవే దృశ్యాలను చూపిస్తూ షేర్ చేసిన స్పష్టమైన వీడియోలలో, వీడియోలోని కారుపై ‘ఢాకా మెట్రో GA-7-9335’ అని బంగ్లా బాషలో రాసి ఉన్న నంబరు ప్లేట్ కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆటోపై కూడా బంగ్లా భాషలో అక్షరాలు రాసి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
వీడియోలో కనిపిస్తున్న ఆటోపై ఒక మొబైలు నంబరు రాసి ఉంది. ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ‘Boom Live’ సంస్థ ఆటో డ్రైవరు మొబైలు నంబరుకు ఫోన్ చేసి మాట్లాడింది. ప్రేమ జంటలు పారిపోవాలనుకుంటే అందుకోసం స్నేహితుల చేసే సహాయాన్ని చూపించేందుకు తన స్నేహితుడు మహమ్మద్ జహీద్ ఈ వీడియోని రూపొందించినట్టు ఆటో డ్రైవరు మహమ్మద్ సోహగ్ బూమ్ సంస్థకు తెలిపారు.
ఈ వీడియో బంగ్లాదేశ్ చాంద్‌పూర్ జిల్లాలోని నోగన్ గ్రామంలో తీశారని, ఈ వీడియోలో నటించిన అమ్మాయి మహమ్మద్ జహీద్ భార్య సుమయ్య అక్తర్ అని మహమ్మద్ సోహగ్ తెలిపారు. ఈ స్క్రిప్టులో ఇద్దరు ప్రేమికులు ఒకే మతానికి చెందిన వారని, ఇందులో మతపరమైన కొణమేమి లేదని మహమ్మద్ సోహగ్ బూమ్ వార్తాసంస్థకు తెలిపారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో మరియు బంగ్లాదేశ్‌కి సంబంధించిన వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, బంగ్లాదేశ్‌లో రూపొందించిన ఒక స్క్రిప్టెడ్ వీడియోని లవ్ జిహాద్ కోణాన్ని జోడిస్తూ షేర్ చేస్తున్నారు.