ముస్లిం స్కల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ఒక మహిళా పోలీస్ అధికారితో దురుసుగా ప్రవర్తిస్తూ, వాదిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోని ‘పోలీసులు అంటే భయం లేదు చట్టం అంటే గౌరవం లేదు దేశం అంటే భక్తి లేదు.. చూడండి ఆ మహిళా పోలీసు అధికారి మీద దౌర్జన్యం.. ఆవిడ కూడా పోయించింది వాళ్ళకి..’ అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఇస్లామిక్ స్కల్ క్యాప్ ధరించిన వ్యక్తి, ఒక మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా ప్రవర్తించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.
ఫ్యాక్ట్: ఇది వినోదం కోసం చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీనిని కంటెంట్ క్రియేటర్ అమిత్ దీక్షిత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో 21 సెప్టెంబర్ 2025న అప్‌లోడ్ చేశారు. కావున, ఈ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ “అమిత్ దీక్షిత్ సోషల్ మెసేజ్” అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాకు లభించింది. దీన్ని అతను 21 సెప్టెంబర్ 2025న అప్‌లోడ్ చేశాడు.
ఈ వీడియో యొక్క ప్రారంభంలో (0:03 దగ్గర), ఇది కేవలం వినోదం కోసం తయారు చేయబడిన ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఇందులో కనిపిస్తున్న దృశ్యాలు నిజమైన సంఘటనను చూపించట్లేదని ఒక డిస్క్లైమర్ ఉంది.

అంతేకాకుండా, వైరల్ క్లిప్‌లో కనిపించే వ్యక్తులు అదే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన అనేక ఇతర స్క్రిప్టెడ్ వీడియోలలో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) నటించారని విషయాన్ని మేము గమనించాం.

గతంలో, ఈ వీడియోలో ఉన్న నటులు నటించిన చాలా వీడియోలు నిజమైన సంఘటనకు చెందిన దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, మేము వాటిని ఫ్యాక్ట్ చెక్ చేశాము (ఇక్కడ & ఇక్కడ).
చివరగా, ఈ వైరల్ వీడియో ఒక ముస్లిం వ్యక్తి , ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా మాట్లాడుతూ, అసభ్యంగా ప్రవర్తించిన ఒక నిజమైన సంఘటనకు చెందినది కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో.