Fake News, Telugu
 

మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడం కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించలేదు

0

న్యూయార్క్‌లో మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడానికి అనుమతించాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన సమయంలో పాకిస్థాన్ , ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను మోదీ వ్యతిరేక ర్యాలీ కోసం అభ్యర్ధించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 25 సెప్టెంబర్ 2021 నాడు ఐక్యరాజ్యసమితి సమితి ఎదుట ఖలిస్తాన్ మద్దతుదారులు మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: న్యూయార్క్‌లో మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడానికి అనుమతించాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా ఇటీవల న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించారు.

ఫాక్ట్ (నిజం): 2019లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడానికి అభ్యర్ధించినట్టు ‘News X’ ఛానల్ 26 సెప్టెంబర్ 2019 రిపోర్ట్ చేసింది. న్యూయార్క్ పోలీసుల సమావేశానికి హాజరైన అమెరికా బీజేపీ కార్యకర్తలు ఈ విషయం తమకు తెలిపారని News X’ ఛానల్ రిపోర్ట్ చేసింది.  కాని, ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మరే వార్తా సంస్థ వీడియో లేదా ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. తన పై చేస్తున్న ఈ ఆరోపణలు తప్పని సామ్ పిట్రోడా 2019లోనే ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గుగూల్‌లో వెతికితే, కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడం కోసం న్యూయార్క్ పోలీసులని అభ్యర్ధించారని రిపోర్ట్ చేస్తూ ‘News X’ న్యూస్ ఛానల్ 26 సెప్టెంబర్ 2019 నాడు వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. న్యూయార్క్ పోలీసులు సామ్ పిట్రోడాని పాకిస్థాన్ నిరసనకారులతో క్లబ్ చేసి కుర్చోబెట్టినట్టు ‘News X’ ఛానల్ రిపోర్ట్ చేసింది. న్యూయార్క్ పోలీసుల సమావేశానికి హాజరైన అమెరికా బీజేపీ కార్యకర్తలు తమకు ఈ విషయం తెలిపినట్టు ‘News X’ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసింది.

‘News X’ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసిన వీడియోని బీజేపీ లీడర్లు చాలా మంది 2019లో ట్వీట్ చేసారు. కానీ, సామ్ పిట్రోడా పై చేసిన ఈ ఆరోపణల గురుంచి గానీ, ధృవీకరిస్తూ గానీ మరే వార్తా సంస్థ వీడియో లేదా ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. 2019లో న్యూయార్క్ నగరంలో మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించుకోవడం కోసం మూడు మోదీ వ్యతిరేక సంస్థలు తమని సంప్రదించారని న్యూయార్క్ పోలీసులు మీడియాకి తెలిపారు. వీటిలో పాకిస్థాన్ మద్దతుతో నడుస్తన్న సంస్థ కూడా ఉందని న్యూయార్క్ పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని క్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, మోదీ వ్యతిరేక ర్యాలీ కోసం అభ్యర్ధించిన వ్యక్తులలో సామ్ పిట్రోడా ఉన్నట్టు న్యూయార్క్ పోలీసులు ఎక్కడా పేర్కొనలేదు.

అంతేకాదు, తన పై చేస్తున్న ఈ ఆరోపణలు తప్పని సామ్ పిట్రోడా 2019లోనే ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఖలిస్తాన్ మద్దతుదారులు 25 సెప్టెంబర్ 2021 నాడు ఐక్యరాజ్యసమితి ఎదుట నిరసన చేపట్టిన మాట వాస్తవం. కాని, ఈ మోదీ వ్యతిరేక ర్యాలీ కోసం సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించినట్టు ఎక్కడా ఎటువంటి వార్తలు, ఆధారాలు లేవు.

చివరగా, మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడం కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll