Fake News, Telugu
 

ఓటుకి ₹10,000 తో పాటు మద్యం పంపిణీ చేస్తామని ఈ వీడియోలో రేవంత్ రెడ్డి చెప్పలేదు

0

30 నవంబర్ 2023న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల నమ్మట్లేదని, అందుకే ఓటుకి ₹10,000 తో పాటు మద్యం పంపిణీ చేసి ఓట్లు కొంటున్నామని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఓటుకి ₹10,000తో పాటు మద్యాన్ని పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో ఎడిట్ చేయబడింది. పూర్తి వీడియోలో ఓటుకి ₹10,000 తో పాటు మద్యం పంపిణీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 24 నవంబర్ 2023 నాడు తుంగతుర్తిలో జరిగిన ఈ ఎన్నికల ప్రచార సభ యొక్క పూర్తి వీడియోని వివిధ వార్తా సంస్థలు ప్రత్యక్షప్రసారం(ఇక్కడ మరియు ఇక్కడ) చేశాయని గుర్తించాం.

అయితే వీడియోని పూర్తిగా పరిశీలించగా 40:50 నిమిషాల దగ్గర రేవంత్ రెడ్డి ఈ విధంగా అన్నారు- “నిన్న సాయంత్రం ప్రగతి భవన్‌లో (కేసీఆర్) అత్యవసర సమావేశం పెట్టాడు. అక్కడ మాట్లాడుకుంది ఏంటంటే, ఇక ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల్లో మన హామీలను ప్రజలు నమ్మట్లేదు. అందుకే ప్రతి ఓటుకి ₹10,000 ఇచ్చి ఓట్లు కొనాలి, రెండు ఫుల్ బాటిల్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు..”. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలంటూ ఒక ఎడిట్ చేసిన వీడియో ప్రచారంలో ఉందని నిర్ధారించవచ్చు.

చివరిగా, ఓటుకి ₹10,000 తో పాటు మద్యం పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా ఉన్న వీడియో ఎడిట్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll