Fake News, Telugu
 

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లక్ష రూపాయల నాణాన్ని విడుదల చేయలేదు

0

రిజర్వు బ్యాంకు లక్ష రూపాయల నాణాన్ని రిలీజ్ చేసిందంటూ లక్ష రూపాయల కాయిన్ ఫోటో వాట్సాప్ లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ విషయం గురించి వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్ లైన్ (+91 9247052470) కి కొందరు మెసేజి పంపించారు. ఇదే ఫోటో 2016 నుండే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ వార్తలో  ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రిజర్వు బ్యాంకు విడుదల చేసిన లక్ష రూపాయల నాణెం ఫోటో.

ఫాక్ట్ (నిజం): రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లక్ష రూపాయల నాణాన్ని విడుదల చేయలేదు. ఇప్పటివరకైతే ₹10 సర్క్యులేషన్ లో ఉన్న నాణాలలో అత్యధిక విలువ కలిగిన నాణెం. ప్రభుత్వం వివిధ ముఖ్యమైన సందర్భాలలో స్మారక నాణాలు విడుదల చేస్తుంది. ₹75, ₹100, ₹150, ₹350 మొదలైన స్మారక నాణాలను విడుదల చేస్తూ వచ్చింది, కాకపోతే ఇవి సాధారణ సర్క్యులేషన్ లోకి రావు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెబ్సైటులో ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న నాణాలకి సంబంధించిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకైతే ₹10 అత్యధిక విలువ కలిగిన నాణెం. 2005లో మొదటిసారిగా ఈ ₹10 నాణాన్ని ముద్రించారు. కాకపోతే ఈ నాణెం మాత్రం 2006 నుండి సర్క్యులేషన్ లోకి వచ్చింది.

ఐతే ఇంతకు ముందు చాలా సార్లు ముఖ్యమైన సందర్భాలలో, ముఖ్యమైన వ్యక్తుల స్మారకార్థం ప్రభుత్వం ₹75, ₹100, ₹150, ₹350 మొదలైన స్మారక నాణాలను విడుదల చేస్తూ వచ్చింది. ఉదాహారణకి 02 అక్టోబర్ 2019న గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ₹150 స్మారక నాణాన్ని విడుదల చేశారు.

దేశంలో వివిధ సందర్భాలను పురస్కరించుకొని విడుదల చేసిన స్మారక నాణాలకు సంబందించిన సమాచారం ఈ కథనంలో చూడొచ్చు. ఈ నాణాలను నాన్ సర్క్యులేటింగ్ లీగల్ టెండర్ (NCLT) కింద పరిగణిస్తారు. ఈ నాణేలు సాధారణ సర్క్యులేషన్ లోకి రావు. ఐతే ఇప్పటి వరకు లక్ష రూపాయల నాణాన్ని మాత్రం ఎవరి స్మారకంగా కూడా విడుదల చేయలేదు. వైరల్ అవుతున్న లక్ష రూపాయల నాణెం ఫోటో డిజిటల్ గా క్రియేట్ చేసింది.

దేశంలోని వివిధ నాణాలను సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) సంస్థ తయారు చేస్తుంది. SPMCIL తమ ముంబై, కలకత్తా, నోయిడా మరియు హైదరాబాద్ బ్రాంచుల ద్వారా వివిధ సందర్భాలను పురస్కరించుకొని విడుదల చేసిన స్మారక నాణాలకు సంబందించిన వివరాలలో కూడా ఎక్కడ కూడా లక్ష రూపాయల నాణెం వివరాలు లేవు.

చివరగా, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లక్ష రూపాయల నాణాన్ని విడుదల చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll