కుక్కలకి మనిషి మాంసం పెడుతున్న భారత దేశం అని, ఇది గంగా నది యొక్క ప్రస్థుత పరిస్థితి అంటూ ఫోటో పెట్టి ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల గంగా నదిలో మనిషి మాంసం కుక్కలు తింటున్న ఫోటో.
ఫాక్ట్: 2008లో భారతదేశంలో కొన్ని నెలలు గడిపిన ఒక సందర్శకుడి యొక్క అకౌంట్ లో పోస్ట్ చేసిన సుమారు 50 చిత్రాలు చైనాలో వైరల్ అయ్యాయి. అందులో మనిషి మాంసం తింటున్న ఈ కుక్కల ఫోటో ఒకటి. ఈ ఫోటో 2010 నుండి ఇంటర్నెట్ లో పలు వెబ్ సైట్ లలో గంగా నదికి సంబంధించినదిగా షేర్ చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్ లోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 27 అక్టోబర్ 2010 లో పబ్లిష్ అయిన ‘ఫిల్తి ఇండియా ఫొటోస్, చైనీస్ నెటిజెన్ రియాక్షన్స్’ అనే ఆర్టికల్ ఒక వెబ్ సైట్ లో లభించింది. ఈ ఆర్టికల్ లోని ఫోటోలు 2008 సంవత్సరం నుండి చైనీస్ ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నట్టు అందులో తెలిపారు. అందులో పోస్టులోని ఫోటో కాప్షన్ గా, ‘భారతదేశంలో కుళ్లిపోయిన శవాలను ఏరుకునే వీధి కుక్కలు’ అని ఉన్నట్టు తెలిసింది. 2008లో భారతదేశంలో కొన్ని నెలలు గడిపిన ఒక సందర్శకుడి యొక్క అకౌంట్ లో పోస్ట్ చేసిన సుమారు 50 చిత్రాలు చైనాలో వైరల్ అయ్యాయి అని, అనేక చైనీస్ ఫోరమ్ లు మరియు కాలమ్ లు వాటిని ప్రచురించాయి అని ఒక వెబ్ సైట్ లోని ఆర్టికల్ ద్వారా తెలిసింది.
ఈ ఫోటో 2010 సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో పలు వెబ్ సైట్ లలో గంగా నదికి సంబంధించినదిగా షేర్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇటీవల పబ్లిష్ చేసిన వార్త కథనాల ఆధారంగా, మరణించిన కోవిడ్ రోగులను గంగా నదిలో వదిలేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారని, ఆ మృతదేహాలను జంతువులు పీక్కు తింటున్నట్టు తెలిపారు. గంగా నదిలో అపుడప్పుడు ఒకటి రెండు శవాలు కొట్టుకు రావడం సహజమే అని ఒక పండిట్ మీడియాకు చెప్పారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. కానీ, పోస్ట్ లోని ఫోటో చాలా సంవత్సరాల క్రితం నాటిది, ఇప్పటిది కాదు.
చివరగా, మనిషి మాంసం కుక్కలు తింటున్న పాత ఫోటోని ఇటీవల గంగా నదికి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.