Fake News, Telugu
 

సంపాదనకు, సంతోషానికి వ్యత్యాసాన్ని తెలుపుతున్న ఈ పాత సందేశాన్ని, రతన్ టాటా చివరి మాటలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

“ ₹ 8,85,56,75,90,000.00/- విలువైన ఆస్తులు కలిగిన రతన్ టాటా చివరి మాటలు…” అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 అక్టోబర్ 2024న మరణించిన టాటా గ్రూప్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఆస్పత్రిలో ఉండగా చెప్పిన/రాసిన చివరి మాటలు అని క్లెయిమ్ చేస్తున్న కొన్ని ఫిలసాఫికల్ జీవిత సూత్రాలు ఈ మెసేజీలో ఉన్నాయి. అసలు ఈ పోస్ట్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: చనిపోయే ముందు రతన్ టాటా చివరి మాటలు ఇవి.

ఫ్యాక్ట్(నిజం): పోస్టులో తెలుపుతున్న ఈ సందేశాన్ని రతన్ టాటా ఇవ్వలేదు. ఇది మొత్తం ఒక కట్టు కథ. ఈ మాటల్ని రతన్ టాటా తన చివరి క్షణాల్లో అన్నారు అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. తన మరణానంతరం వచ్చిన వార్తా కథనాల్లో కూడా ఎక్కడా ఈ సందేశం గురించి ఎవరూ పేర్కొనలేదు. ఆయన మరణించకముందు టాటా చేసిన ఆఖరి ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొడుతున్నారు అని, పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పారు.  పైగా, వైరల్ పోస్టులో ఉన్న ఇదే సందేశం 2015 నుంచి అనేక ప్రముఖ వ్యక్తులకి ఆపాదిస్తూ వైరల్ అవుతోంది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ అవుతున్న ఈ పోస్ట్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, వైరల్ పోస్టులో ఉన్న సందేశాన్ని రతన్ టాటా ఆస్పత్రిలో చివరిగా చెప్పిన విషయాలు అని చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. టాటా గ్రూప్ తమ సోషల్ మీడియాలో కానీ తమ వెబ్సైటులో కానీ, రతన్ టాటాకి ఈ సందేశాన్ని ఆపాదిస్తూ ఎలాంటి పోస్టులు చేయలేదు.   

రతన్ టాటా మరణం తర్వాత దాదాపు అన్ని ప్రధాన వార్త సంస్థలు ఆయన గురించి రకరకాల వార్తా కథనాలని ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఆయన నిజంగానే ఈ సందేశాన్ని తన ఆఖరి క్షణాల్లో చెప్పి ఉంటే, అన్ని వార్తా సంస్థలు ఆ విషయాన్ని రిపోర్ట్ చేసేవి.

రతన్ టాటా ఇలాంటి సందేశాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఏమైనా ఇచ్చారా అని వెతకగా 7 అక్టోబర్ 2024న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ). ఇందులో తన మరణానికి సంబంధించి వస్తున్న కొన్ని పుకార్లను ఉద్దేశిస్తూ, వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రిలో తను చికిత్స పొందుతున్నారు అని చెప్పారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని, తను ‘good spirits’లో ఉన్నారని చెప్పారు. మీడియా మరియు ప్రజలు పుకార్లను షేర్ చేయవద్దు అని చెప్పారు. 

9 అక్టోబర్ 2024న రతన్ టాటా మరణించిన తర్వాత, ఆయన ఇచ్చిన ఆఖరి స్పీచ్ అని చెప్పి ఒక వీడియోను వార్తా సంస్థలు షేర్ చేశాయి. ఆ స్పీచ్ మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇందులో కూడా తాను వైరల్ పోస్టులో చెప్పిన విషయాలని చెప్పలేదు. దీన్ని బట్టి, ఒక కల్పిత సందేశాన్ని, రతన్ టాటాకు తప్పుగా ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది.

గతంలో కూడా వైరల్ పోస్టులో ఉన్న సందేశం ‘ఆపిల్’ అధినేత స్టీవ్ జాబ్స్, తను చనిపోయే ముందు ఇచ్చిన ఆఖరి సందేశం అని చెప్పి వైరల్ అయినప్పుడు ఆ క్లెయిమ్ తప్పు అని చెప్పి ఫాక్ట్ – చెక్ చేసాము. వాస్తవానికి, ఈ మెసేజ్ 2015 నుంచి వివిధ వ్యక్తులకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

చివరిగా, రతన్ టాటా ఆఖరి సందేశం అని చెప్పి సంబంధం లేని ఒక పాత పోస్ట్ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll