కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లోని 33 జిల్లాల్లోని హిందువు నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న దేవాలయ భూములలో పూర్తిగా ఎయిర్ కండిషన్ సౌకర్యంతో 33 ముస్లిం హాస్టళ్లను నిర్మిస్తుంది అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లోని 33 జిల్లాల్లోని హిందూ దేవాలయ భూములలో పూర్తిగా ఎయిర్ కండిషన్ సౌకర్యంతో 33 ముస్లిం హాస్టళ్లను నిర్మిస్తుంది.
ఫాక్ట్: రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ‘Department of Information & Public Relations’ వారు ఈ ప్రచారాన్ని ఖండిస్తూ మే 2022లోనే ప్రకటన జారీ చేశారు. దీని ప్రకారం, రాష్ట్రంలో 2014-15 నుండి వెనుకబడిన మైనారిటీ విద్యార్ధుల కోసం హాస్టళ్లు నిర్మించే స్కీము ఉంది. ఈ నిర్మించే హాస్టళ్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే నిర్మిస్తారు. మరియు ఈ హాస్టళ్లలో కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతాలకు చెందిన విద్యార్ధులకు కూడా వసతి ఉంటుంది. ఇక సికార్ జిల్లా లో నిర్మిస్తున్న హాస్టల్ ప్రదేశం దేవాలయ స్థలం కాదు అని పోలీసులు నిర్ధారించారు. ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ముందుగా ఇదే విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా ఎక్కడా వార్తలు లభించలేదు. రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన అనేక వెబ్‌సైటులలో ఎక్కడా కూడా ఈ విషయం గురించి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పైగా, ఇదే ప్రచారం ఏప్రిల్ 2022 నుంచి జరుగుతుంది అని గుర్తించాము. అప్పుడు రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ‘Department of Information & Public Relations’ వారు ఈ ప్రచారాన్ని ఖండిస్తూ నోటీసు జారీ చేశారు. దీని సారాంశం క్రింద చూడవచ్చు:
దేవాలయ భూమిలో ప్రభుత్వం ముస్లిం హాస్టళ్లను నిర్మిస్తుంది అని జరుగుతున్న ప్రచారం అసత్యం, ఇందులో వాస్తవం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ‘ Social Justice and Empowerment’, ‘Tribal Area Development’ మరియు ఇతర డిపార్ట్‌మెంట్లకు కేటాయించిన స్థలంలో మాత్రమే బలహీన వర్గాలు మరియు మైనారిటీలకు చెందిన విద్యార్ధులకు హాస్టళ్లు నిర్మించబడతాయి. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ప్రజా అభివృద్ధి కార్యక్రమం కింద మైనారిటీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత వసతి కల్పించబడుతుంది. 2014-15 సంవత్సరం నుండి రాష్ట్రంలో ఈ హాస్టళ్లు నిర్మించబడుతున్నాయి.
సైన్స్ కాలేజ్, పంచాయితీ భవన్ వంటి ప్రభుత్వ భవనాలకు గతంలో భూమిని కేటాయించారు. సికార్ జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద నిర్మాణంలో ఉన్న మైనారిటీ బాలుర వసతి గృహం కోసం కేటాయించిన భూమి దేవాలయ భూమి కాదు. మరియు హాస్టల్ మరియు గుడి వేరు వేరు రోడ్డులలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క మతం కోసం హాస్టల్ భవనాన్ని నిర్మించలేదు. మైనారిటీ వ్యవహారాల శాఖచే నిర్మించబడుతున్న హాస్టళ్లు ఏ నిర్దిష్ట కమ్యూనిటీ కోసం కాదు. ఇవి ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, పార్శీ మరియు జైన వంటి మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం నిర్మించారు.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, ఇదే తప్పుడు ప్రచారాన్ని నమ్మి రాజస్థాన్‌లోని బైరుపుర, సబల్పురా గ్రామాల్లో దేవాలయ భూమిలో స్థానికులు ఆందోళన చేయగా, పోలీసులు అక్కడికి చేరుకొని దేవాలయ స్థలంలో ఎక్కడా కూడా అటువంటి నిర్మాణం జరగలేదు అని నిర్ధారించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
చివరిగా, దేవాలయ భూమిలో రాజస్థాన్ ప్రభుత్వం ముస్లిం హాస్టళ్లను నిర్మిస్తుంది అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.