Fake News, Telugu
 

మునుగోడు ఎన్నికల ముందు రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి కేసీఆర్‌ను కలిసారంటూ షేర్ చేస్తున్న వీడియోలు ఫేక్

0

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి భయంతో తెలంగాణ సిఎం కేసీఆర్‌ను అర్థ రాత్రి రహస్యంగా కలిశారు అని చెప్తూ NTV లోగో తో ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌తో ఉన్న ఫొటోని కూడా చూడవచ్చు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అర్థ రాత్రి రహస్యంగా కలిసిన దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియోను ‘NTV’ ఛానెల్ వారు ప్రసారం చేయలేదు. అలాగే ఇతర ఛానెళ్ళు మరియు వార్తా పత్రికలలో కూడా ఇటీవల వీరు భేటీ అయినట్లు వార్తలు లేవు. వీడియోలో రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌తో ఉన్న ఫొటో 2021 డిసెంబర్‌లో రాజగోపాల్ రెడ్డి కుమారుడి పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నప్పుడు తీసినది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ వీడియోని ‘NTV’ కి చెందిన వివిధ సోషల్ మీడియా అకౌంటులలో మరియు యూట్యూబ్ లో  వెతకడం జరిగినది. కానీ ఎక్కడా కూడా ఈ వీడియో కానీ, వార్త కానీ వారు ప్రసారం చేయలేదు. మిగతా న్యూస్ ఛానల్స్, వార్తా పత్రికల్లో ఎక్కడా కూడా ఇటీవల ఇద్దరు భేటీ అయినట్లు వార్తలు లేవు. ఇక ఈ వీడియోలో రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌తో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఈ ఫోటో  డిసెంబర్ 2021 కి చెందినదిగా తెలిసింది.

News18’ వెబ్‌సైటులో ఉన్న కథనం ప్రకారం, ఈ ఫోటో రాజగోపాల్ రెడ్డి తన కుమారుడి వివాహానికి (12 డిసెంబర్ 2021) కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నప్పుడు తీసినది.

అయితే, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కూడా ఎన్నికల ముందు కేసీఆర్‌ను కలిసినట్లు ఇదే విధంగా ‘NTV’ లోగో తో మరొక వీడియో వైరల్ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిని ఫేక్ వీడియో గా ఖండించారు

చివరిగా, రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి తెలంగాణా సీఎం కేసీఆర్‌ను ఇటీవల మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కలిసినట్లు షేర్ చేస్తున్న వీడియోలు ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll