Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారు అన్నట్టు వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతున్న వీడియోను పోస్టు చేస్తూ, రాహుల్ గాంధీ ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారని అన్నారని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే వీడియోను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ అన్నారు.

ఫాక్ట్(నిజం): 19 ఫిబ్రవరి 2024న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రసంగం యొక్క అసలు వీడియోను 26:22 నుండి 26:29 టైమ్‌స్టాంప్ మరియు 26:59 నుండి 27:10 టైమ్‌స్టాంప్ మధ్య ఎడిట్ చేసి అతని ప్రసంగం యొక్క సందర్భాన్ని వక్రీకరించి ప్రచురించారు. వాస్తవానికి రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

వైరల్ వీడియో గురించి తెలుసుకునేందుకు మేము తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఈ బహిరంగ సభ యొక్క పూర్తి వీడియోను భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక YouTube ఛానెల్‌లో ప్రచురించబడింది అని కనుగొన్నాము. “శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు” అనే టైటిల్ పేరుతో ఈ బహిరంగ సభ 19 ఫిబ్రవరి 2024న ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.ఈ పూర్తి వీడియోను జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ గాంధీ మాటల సందర్భం స్పష్టంగా అర్థమవుతుంది.

మొత్తం వీడియోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, అసలు వీడియోను 26:22 నుండి 26:29 టైమ్‌స్టాంప్ మరియు 26:59 నుండి 27:10 టైమ్‌స్టాంప్ మద్య ఎడిట్ చేసి ప్రచురించారని గమనించాం. అందువల్ల, వైరల్ వీడియోలో అతని వ్యాఖ్యల సందర్భం మారింది. వాస్తవానికి నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో,  “రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో, మీరు దళితుడిని చూశారా, రైతును చూశారా? భారత రాష్ట్రపతిని లోపలికి అనుమతించలేదు, మీరు రైతు లేదా కూలీని చూశారా? మీరు అదానీని చూశారు, అంబానీని చూశారు, అమితాబ్ బచ్చన్‌ను చూశారు, ఇది మీ హిందూస్థాన్ కాదు. ‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’ అని చెప్పడం మీ పని. వారి (అదానీ మరియు అంబానీ) పని డబ్బు లెక్కించడం, వారి పని ప్రైవేట్ విమానంలో ప్రయాణించడం, వారి పని సరదాగా గడపడం, మీ పని అక్కడ ఇక్కడ చూడటం, అక్కడ చూడండి సోదరా, పాకిస్తాన్, అక్కడ చూడు అమితాబ్ బచ్చన్ ఒక కొత్త డ్యాన్స్ చేసాడు, చేస్తూనే ఉండండి… మీకు కావలసినంత ఆనందించండి, అందరూ ఆకలితో చస్తారు, అందరూ ఆకలితో చస్తారు, అందరి సమయం వస్తుంది, ఎవరూ మిగలరు… అందరూ ఆకలితో చనిపోతారు” అని మాట్లాడారు.

రాహుల్ గాంధీ ప్రసంగం యొక్క ఎడిట్ చేయబడ్డ వీడియో షేర్ చేయడం వల్ల ఆయన ‘భారత్ మాతా కీ జై’ ‘జై శ్రీరామ్’ అంటే పస్తులుంటారని అన్నారనే అభిప్రాయాన్న కలిగిస్తుంది. ఈ  ప్రసంగం గురించి పలు వార్తా కథనాలను (ఇక్కడ మరియు ఇక్కడ) పరిశీలించినా, ఆయన ప్రసంగం యొక్క అసలు సందర్భం అర్థమవుతుంది.

చివరిగా, ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారు అన్నట్టు వక్రీకరించి రాస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll