గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్ (GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) పేరుతో గల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్ (GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) ఉద్యోగ నియామక నోటిఫికేషన్.
ఫాక్ట్(నిజం):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫేక్. గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్ వెబ్‌సైట్ వివరణ విభాగంలో ఈ వెబ్‌సైట్ రూపొందించింది, నిర్వహిస్తుంది ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ (ISDO) అని ఉంది. ఈ ISDO వెబ్‌సైట్ డొమైన్ మార్చ్ 2021లో అమెరికాలో రిజిస్టర్ అయ్యింది. అలాగే గతంలో కూడా ఈ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వైరల్ అయినప్పుడు, అది ఫేక్ అని చెప్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) వారు స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో ఇచ్చిన అప్లై లింక్ ప్రెస్ చేస్తే, గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్(GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) పేరుతో ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయ్యింది, ఈ వెబ్‌సైట్‌ను జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఈ నియామక నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ 07 మార్చి 2023న ముగుస్తుంది అని ఉంది. అలాగే వెబ్‌సైట్ తాజా సమచారంలో అప్లికేషన్ ప్రక్రియ 07 మార్చి 2024న ముగుస్తుంది అని ఉంది. తదుపరి మేము వెబ్‌సైట్‌లో ఉన్న పూర్తి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసి చూడగా అందులో ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ (లేబర్ & ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్) పేరుతో నోటిఫికేషన్ ఉంది. వెబ్‌సైట్‌లో ఈ సంస్థ ఫోన్ నెంబర్ గాని, పూర్తి అడ్రస్ వివరాలు కూడా లేవు. అలాగే, వివరణ విభాగంలో ఈ వెబ్ సైట్ రూపొందించింది, నిర్వహిస్తుంది ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ (ISDO) అని ఉంది.
అలాగే ఈ రిక్రూట్మెంట్‌కీ, ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధంలేదు. కేంద్ర లేబర్ & ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో గానీ లేక, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో గానీ, లేక ఇతర అనుబంధ సంస్థల వెబ్‌సైట్లలో గానీ, ఈ రిక్రూట్మెంట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇది ప్రభుత్వ నియామకం అయ్యుంటే, దీని గురించి ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉండాలి.
కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ద్వారా వివిధ సంస్థలు, ఇతర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, NGOలతో కలిసి యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణ అందిస్తుంది. ఐతే ISDO వెబ్‌సైట్‌లో గాని, గ్రామీణ్ యువరోజ్‌గార్ & డెవలప్మెంట్ ( GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) వెబ్‌సైట్‌లో గాని ఈ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేస్తునట్టు ఎటువంటి సమాచారం లేదు. సంస్థ ఫోన్ నెంబర్ గాని, పూర్తి అడ్రస్ వివరాలు కూడా లేవు.
కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) వెబ్సైటులో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ నియామకాలు జరుగుతున్నాయని, ఈ నియామకాలకి NSDCకి ఎటువంటి సంబంధంలేదని తెలుపుతూ, కొన్ని ఫేక్ నియామకాల ఉదాహారణలు కూడా ఇచ్చారు.
పైగా ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ (ISDO) వెబ్సైటు (https://isdoindia.org) డొమైన్ మార్చ్ 2021లో అమెరికాలో రిజిస్టర్ అయ్యింది. వీటన్నిటి బట్టి ఈ రిక్రూట్మెంట్‌కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని మరియు ఫేక్ అని అర్ధమవుతుంది.
గతంలో కూడా ఈ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వైరల్ అయినప్పుడు, అది ఫేక్ అని చెప్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) వారు పెట్టిన ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్(GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఫేక్, ఇలాంటి వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండండి.