Fake News, Telugu
 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించలేదు

0

“ప్రభుత్వ పాఠశాల, కళాశాల సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ”, “సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంకి అనర్హులు అని తేల్చి చెప్పిన PM నరేంద్ర మోదీ” అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఫాక్ట్(నిజం): ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించలేదు. ఈ వైరల్ న్యూస్ టెంప్లేట్స్ ఫేక్. ఈ వార్తలను ఏ వార్తా సంస్థ ప్రసారం చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ పోస్టులలో చెప్పినట్లుగా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు మాత్రమే లేదా రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని నరేంద్ర మోదీ ప్రకటించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటనలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తా కథనాలు మాకు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా భారత ప్రభుత్వ వర్గాలు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే, పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు  తీసుకున్నట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు.

తదుపరి, మేము ప్రధాని మోదీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను, వెబ్‌సైట్ (ఇక్కడఇక్కడఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఆయన వైరల్ వైరల్ క్లెయిమ్‌లను సమర్థించే వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్‌లను మేము పరిశీలించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఏ నోటిఫికేషన్‌లలో కూడా కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు లేదా రీల్స్ చేయని వారు మాత్రమే ఆయా ఉద్యోగాలకు అర్హులని లేదు. దీన్ని బట్టి ఈ వైరల్ న్యూస్ టెంప్లేట్స్ ఫేక్ అని మనం నిర్ధారించవచ్చు.

ఈ క్రమంలోనే తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విద్యా సంస్థల నుండి ఉత్తీర్ణులైన 12వ తరగతి విద్యార్థులకు వైద్యం, సాంకేతిక విద్య వంటి వివిధ డిగ్రీ కోర్సులలో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిసింది (ఇక్కడ, & ఇక్కడ).

చివరగా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll