Fake News, Telugu
 

పేటిఎం యాప్‌లో రైలు టిక్కెట్ల ఉచిత రద్దు సౌకర్యం కోసం వసూలు చేసే ప్రీమియం ప్రయాణ దూరం, తరగతి మొదలైన వాటి ఆధారంగా వ్యత్యాసం ఉంటుంది

0

రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందొచ్చని తెలిపింది,’ అంటూ పలు వార్తా సంస్థలు ఇటీవల కథానాలను పబ్లిష్ చేసాయి. ఈ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే ఆఫర్‌ను పేటిఎం ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే సౌకర్యాన్ని పేటిఎం ఇటీవల ప్రకటించిన మాట వాస్తవం. అయితే, ఈ ఉచిత రద్దు సౌకర్యం కోసం కట్టే ప్రీమియం 15 రూపాయల నుంచి మొదలయ్యి, ప్రయాణ దూరం, తరగతి మొదలగు వాటి ఆధారంగా పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం పేటిఎం యాప్‌లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే కొన్ని ఎంపిక చేసుకున్న రైలులకు మాత్రమే వర్తిస్తుందని పేటిఎం స్పష్టంగా తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే సౌకర్యాన్ని పేటిఎం ఇటీవల ప్రకటించిందనే విషయం తెలిసింది. తక్కువ ప్రీమియం చెల్లించి చివరి నిమిషంలో రైలు టికెట్లు రద్దు చేసుకునే సందర్భంలో పూర్తి రిఫండ్ పొందే సదుపాయాన్ని తాము ప్రారంభిస్తున్నామని పేటిఎం 04 అక్టోబర్ 2023 నాడు పబ్లిష్ చేసిన ఈ కథనంలో తెలిపారు. ఈ ప్రీమియం ప్రారంభ ధర రూ. 15 అని తెలిపారు.  

ప్రీమియం చెల్లించిన పేటిఎం యూసర్ రైలు బయలుదేరే సమయానికి 6 గంటల ముందు ఒకవేళ ట్రైన్ టికెట్ రద్దు చేసుకుంటే, క్యాన్సిల్ చేసుకున్న టికెట్‌పై పూర్తి రిఫండ్ పొందవచ్చని పేటిఎం తెలిపింది. తత్కాల్ టికెట్లకు కూడా ఈ పూర్తి రిఫండ్ వర్తిస్తుందని, టికెట్ రద్దు చేసుకున్న వెంటనే రీఫండ్ సోర్స్ అకౌంటులోకి వెంటనే జమ అవుతుందని ఈ కథనంలో పేటిఎం సంస్థ స్పష్టం చేసింది.

అయితే, ఈ రైలు టిక్కెట్ల ఉచిత రద్దు సౌకర్యంపొందడానికి కట్టే ప్రీమియం 15 రూపాయల నుంచి మొదలయ్యి, ప్రయాణ దూరం, తరగతి మొదలగు వాటి ఆధారంగా పెరుగుతుందని తెలిసింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వరకు బుక్ చేసిన 3rd ఏసీ టికెట్‌పై ఉచిత రద్దు ప్రీమియం ధర ప్రతి మనిషికి రూ. 357 అని చూపిస్తుంది. అలాగే, సికింద్రాబాద్ నుండి కొల్‌కతా హౌరా జంక్షన్ వరకు స్లీపర్ తరగతి బుక్ చేసుకున్న టికెట్‌పై ఉచిత రద్దు ప్రీమియం ధర ప్రతి మనిషికి రూ. 69 అని చూపిస్తుంది.   

అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం పేటిఎం యాప్‌లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే కొన్ని ఎంపిక చేసుకున్న రైళ్లకు మాత్రమే వర్తిస్తుందని పేటిఎం స్పష్టంగా తెలిపింది.

ఇటీవల, మేక్ మై ట్రిప్ ద్వారా ‘ట్రిప్ గ్యారంటీ’ అన్న ఆప్షన్ ఉన్న రైలు బుక్ చేసుకొని అది కంఫర్మ్ అవనప్పుడు, చెల్లించిన దానికంటే మూడింతలు ఎక్కువ డబ్బు తిరిగి వస్తుందని ఇలాగే తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు పెడితే, ఫాక్ట్‌లీ దానికి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, పేటిఎం యాప్‌లో రైలు టిక్కెట్ల ఉచిత రద్దు సౌకర్యం కోసం వసూలు చేసే ప్రీమియం ప్రయాణ దూరం, తరగతి మొదలైన వాటి ఆధారంగా వ్యత్యాసం ఉంటుంది.

Share.

About Author

Comments are closed.

scroll